‘ఎగ్​ షెల్​ పేరెంటింగ్​’... మీ పిల్లలతో ఇలా ప్రవర్తిస్తున్నారా?

  • పిల్లలతో తల్లిదండ్రులు వ్యవహరించే తీరు ఎన్నో రకాలు
  • మీ పిల్లల వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును నిర్ణయించేది అవే...
  • అందులో ‘ఎగ్ షెల్ పేరెంటింగ్’, దాని లాభనష్టాలేమిటో వెల్లడించిన మానసిక నిపుణులు
తమ పిల్లలను పెంచే విషయంలో తల్లిదండ్రులు ఒక్కొక్కరు ఒక్కో తీరులో వ్యవహరిస్తుంటారు. పిల్లల మీద ఎంతో ప్రేమ చూపిస్తూ, వారిని నిరంతరం కనిపెట్టుకుని ఉంటుంటారు. అందులో కొందరు పిల్లల విషయంలో అతి జాగ్రత్తగా ఉంటుంటారు. జాగ్రత్తగా ఉండటం వరకు మంచిదేగానీ... కొన్ని విషయాల్లో తీవ్రంగా వ్యవహరిస్తుంటారు. అలాంటి వాటిలో ‘ఎగ్ షెల్ పేరెంటింగ్’ తీరు ఒకటి. ఇటీవలికాలంలో తల్లిదండ్రులు ఇలా వ్యవహరించడం ఎక్కువైపోయింది. మరి ఈ ‘ఎగ్ షెల్ పేరెంటింగ్’ ఏమిటి? మీరు మీ పిల్లలతో ఇలా ప్రవర్తిస్తున్నారా? దీనివల్ల ఏర్పడే ప్రభావం ఏమిటనే దానిపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం...

భయంతో కూడిన నియంత్రణ
  • పిల్లల విషయంలో అతి జాగ్రత్త, వారు ఎక్కడ తప్పులు చేస్తారోనన్న అతి నియంత్రణను ‘ఎగ్ షెల్ పేరెంటింగ్’గా నిపుణులు పేర్కొంటారు. ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు కొడతారో, తిట్టేస్తారోనన్న భయాన్ని పిల్లల్లో నెలకొల్పడం దీనిలోని ప్రధాన అంశం.
  • పిల్లలు ఎలాంటి సమస్యను ఎదుర్కోకుండా తల్లిదండ్రులు అతి జాగ్రత్త చూపడం, నియంత్రించడం వల్ల... పిల్లలలో సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం అలవడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 
  • సొంతంగా నేర్చుకోవాలనే ధ్యాస, అవకాశాలను అందిపుచ్చుకోవాలనే తత్వం, సమస్యలను సొంతంగా పరిష్కరించుకునే సామర్థ్యం అలవడకుండా పోతాయని హెచ్చరిస్తున్నారు. 
  • ఏవైనా ఇబ్బందులు, సమస్యలను ఎదుర్కొన్నప్పుడే పిల్లల్లో ఉద్వేగాలను నియంత్రించుకునే శక్తి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ ‘ఎగ్ షెల్ పేరెంటింగ్’ తీరుతో వారిలో ఉద్వేగాలను నియంత్రించుకునే సామర్థ్యం లేకుండా పోతుందని స్పష్టం చేస్తున్నారు.
  • నిరంతరం పిల్లలను క్రమశిక్షణలో, నియంత్రణలో పెట్టడానికి ప్రయత్నిస్తూ.. తల్లిదండ్రులు అలసిపోతారని, దానివల్ల అనవసరంగా కోపగించుకోవడం వంటివి చేస్తారని వివరిస్తున్నారు.
  • పిల్లల మీద అతి ప్రేమతో వారిని మీరు నియంత్రణలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నా... తమపై నమ్మకం లేక, కోపంతోనే తల్లిదండ్రులు అలా చేస్తున్నారని పిల్లలు భావించే అవకాశం ఎక్కువని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

కొంత వరకు ‘ఎగ్ షెల్’ తీరు మంచిదే...
‘ఎగ్ షెల్ పేరెంటింగ్’ పూర్తిగా తప్పు కాదని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిదేనని... అయితే చిన్న చిన్న అంశాల్లో పిల్లలను తప్పులు చేయనివ్వాలని, వాటి నుంచి నేర్చుకోనివ్వాలని సూచిస్తున్నారు. అదే సమయంలో పిల్లలు చేస్తున్న తప్పు ఏమిటనేది శ్రద్ధగా, ప్రేమతో వారికి అర్థమయ్యేలా వివరించడం వల్ల ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు.


More Telugu News