యూకేలో వెటర్నరీ డాక్టర్ ఆత్మహత్య.. కారణం తెలిస్తే హృదయం ద్రవించిపోతుంది..!

  • పెంపుడు జంతువుల విషయంలో సంపన్నుల పీనాసితనంతో డాక్టర్ కు విరక్తి
  • వైద్యానికి ఖర్చు చేయడం ఇష్టంలేక ‘యూథనేషియా’ కోసం అభ్యర్థిస్తున్నారని వెల్లడి
  • తన చేతులతో చాలా జంతువులను చంపేశానని ఆవేదన
పెంపుడు జంతువుల పట్ల సంపన్నులు చూపుతున్న పీనాసితనంతో ఓ వైద్యుడు విరక్తి చెందాడు. తన చేతులతో చాలా జంతువులను చంపేయాల్సి వచ్చిందని డిప్రెషన్ కు లోనై ఆత్మహత్య చేసుకున్నాడు. నొప్పి తెలియకుండా జంతువుల ప్రాణంతీసే మందును తన శరీరంలోకి ఎక్కించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. లండన్ కు చెందిన ఈ వెటర్నరీ డాక్టర్ ఉదంతం గురించి తెలిస్తే కంటతడి పెట్టించక మానదు.

లండన్ లోని వించెస్టర్ లో జాన్ ఎల్లిస్ వెటర్నరీ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. వయసు 35 ఏళ్లే అయినా తన వృత్తిలో బాగా పేరు సంపాదించుకున్నాడు. జంతువులను చూస్తూనే వాటి అనారోగ్యాన్ని గుర్తించగలడని ఎల్లిస్ సహచర వైద్యులు చెబుతుంటారు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే వ్యక్తి సడెన్ గా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జంతువుల యూథనేషియాకు ఉపయోగించే మందుతో తన ప్రాణం తీసుకున్నాడు. ఈ విషయంపై డాక్టర్ ఎల్లిస్ తల్లి టినా ఎల్లిస్ మాట్లాడుతూ.. పెంపుడు జంతువుల విషయంలో తన క్లయింట్లు చూపుతున్న నిర్లక్ష్యం, పీనాసితనంతో తన కొడుకు తీవ్రంగా బాధపడేవాడని తెలిపారు.

వైద్యం చేయించడం కోసం పెట్టే ఖర్చు కన్నా వాటిని యూథనేషియా ద్వారా చంపేయడమే మేలని తన క్లయింట్లు భావిస్తున్నారని చెప్పాడన్నారు. లగ్జరీ కార్లలో తిరుగుతూ, ఖరీదైన లైఫ్ స్టైల్ మెయింటెన్ చేస్తున్న వారు తమ పెంపుడు జంతువుల విషయంలో మాత్రం పీనాసితనంతో వ్యవహరిస్తున్నారని తనతో చెప్పేవాడన్నారు. వైద్య ఖర్చులు భరించడం కన్నా నొప్పి తెలియకుండా వాటిని చంపేయాలని కోరేవారని, ఉద్యోగ బాధ్యతల కారణంగా గత్యంతరం లేక తాను చేయాల్సి వస్తోందని ఆవేదనకు గురయ్యేవాడని వివరించారు. ఇది తట్టుకోలేక ఒత్తిడికి లోనై చివరకు తనే బలవన్మరణానికి పాల్పడ్డాడని టినా ఎల్లిస్ చెప్పారు.


More Telugu News