అదానీ సంస్థ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆదినారాయణ వర్గీయుల దాడి..!

  • సమాచారం ఇవ్వకుండా పనులు ఎలా మొదలు పెడతారంటూ ఎమ్మెల్యే అనుచరుల దాడి
  • క్యాంప్ సైట్‌పైనా దాడి.. వాహనాల ధ్వంసం
  • ఎమ్మెల్యే వర్గీయులపై ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్‌లో అదానీ సంస్థ ప్రతినిధుల ఫిర్యాదు
  • స్థానికులకు ఉద్యోగాలు అడిగేందుకే వెళ్లారంటున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి
వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో అదానీ సంస్థ సిబ్బందిపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు దాడికి పాల్పడటం తీవ్ర సంచలనం అయింది. కొండాపురం రాగికుంట గ్రామం వద్ద పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు చేస్తున్న అదానీ సంస్థ సిబ్బందిపై రాళ్ల దాడి చేయడంతో పాటు కంపెనీ క్యాంప్ పైనా దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. అక్కడ ఉన్న వాహనాలు, యంత్రాలను ధ్వంసం చేశారు. 

స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా పనులు ఎలా చేపడతారంటూ ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులు అనుచరులతో కలిసి మంగళవారం సాయంత్రం నిర్మాణ సైట్ వద్దకు వెళ్లి నిలదీశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై మంగళవారం రాత్రి ఆ సంస్థ ప్రతినిధులు ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేయనున్నట్లు ఎస్ఐ రుషికేశ్వర్ రెడ్డి మీడియాకు తెలిపారు. 
 
రాగికుంట వద్ద 470 ఎకరాల విస్తీర్ణంలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో అదానీ సంస్థ పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించింది. అక్కడ క్యాంపు ఏర్పాటు చేసుకుని యంత్రాలతో నేల చదును పనులు చేపట్టింది. అయితే తమ వర్గీయులపై వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఖండించారు. తమ ప్రాంతంలో పరిశ్రమ పెడుతున్నారని తెలిసి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, తమ వాహనాలను అద్దెకు పెట్టుకోవాలని అడగడానికి మాత్రమే తమ వాళ్లు అక్కడికి వెళ్లారని, అదే సమయంలో అక్కడ వైసీపీ నాయకులు కనిపించడంతో తమ వాళ్లకు కోపం వచ్చిందని, అంతకు మించి అక్కడ ఏమీ జరగలేదని ఆయన అన్నారు. 


More Telugu News