కాలుష్యాన్ని తగ్గించాలంటే అదొక్కటే పరిష్కారం: కేంద్రానికి ఢిల్లీ మంత్రి లేఖ

  • కృత్రిమ వర్షమే పరిష్కారమన్న ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్
  • ఇది మెడికల్ ఎమర్జెన్సీ... ప్రధాని జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
  • పర్యావరణ శాఖ మంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్
కాలుష్యాన్ని కట్టడి చేయాలంటే కృత్రిమ వర్షమే పరిష్కారమని, కాబట్టి ఇందుకు అనుమతుల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు.

ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం కూడా దేశరాజధానిని పొగమంచు కమ్మేసింది. గాలి ఏక్యూఐ 494గా నమోదు కాగా... ఎనిమిది ప్రాంతాల్లో 500 కూడా దాటింది. దీంతో ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో గోపాల్ రాయ్ లేఖ రాశారు. ఉత్తర భారతదేశాన్ని పొగమంచు కమ్మేస్తోందని, దీని నుంచి విముక్తి కలిగించాలంటే కృత్రిమ వర్షమే పరిష్కారమని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది మెడికల్ ఎమర్జెన్సీ అన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ప్రధాని మోదీ బాధ్యత అన్నారు. కాలుష్య నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. కృత్రిమ వర్షంపై కేంద్రానికి గత కొన్ని రోజులుగా లేఖలు రాస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. అందుకే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి... తగిన చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News