రుషికొండ విలాసవంతమైన భవనాలపై శాసనమండలిలో వాడీవేడి చర్చ

  • హరిత రిసార్ట్ ను కూల్చి ప్యాలెస్ నిర్మించారన్న కందుల దుర్గేశ్
  • ప్రజాధనం దుర్వినియోగమైతే చూస్తూ ఊరుకోవాలా? అని అచ్చెన్న ప్రశ్న
  • ఆ భవనాలను ఎవరైనా వాడుకోవచ్చన్న బొత్స
గత ప్రభుత్వ హయాంలో విశాఖలోని రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాలపై ఏపీ శాసనమండలిలో వాడీవేడి చర్చ జరిగింది. మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ... రుషికొండపై ఉన్న 58 గదుల హరిత రిసార్ట్ ను కూలగొట్టి విలాసవంతమైన ప్యాలెస్ లను నిర్మించారని మండిపడ్డారు. అద్భుతమైన రిసార్ట్ కడతామని తొలుత చెప్పారని... చివరకు సీఎం నివాసం కోసమని చెప్పారని దుయ్యబట్టారు. ప్రజల డబ్బులతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తామంటే ఎవరూ అంగీకరించరని అన్నారు.  

మరో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... ప్యాలెస్ నిర్మాణం జరుగుతున్న సమయంలో ఎవరినీ అక్కడకు అనుమతించలేదని విమర్శించారు. కళ్ల ముందు వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైతే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. అందరికీ రుషికొండ భవనాలను చూపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

మరోవైపు వైసీపీ నేత, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... రుషికొండ నిర్మాణాల్లో అవకతవకలు జరిగితే విచారణ జరిపించాలని అన్నారు. రుషికొండ భవానాలు ఏ ఒక్కరి కోసమో కట్టినవి కాదని చెప్పారు. సీఎం, పీఎం, మరెవరైనా వాటిని వాడుకోవచ్చని అన్నారు.


More Telugu News