మరో 21 పరుగులు సాధిస్తే చాలు.. విరాట్ కోహ్లీ ఖాతాలో మరో మైలురాయి
- బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 2,000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా నిలవనున్న విరాట్
- కోహ్లీకి ముందు ఈ ఘనత సాధించింది నలుగురు భారతీయ బ్యాటర్లు మాత్రమే
- నవంబర్ 22 నుంచి భారత్-ఆసీస్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ మొదలు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారించి ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదలు కానున్న నేపథ్యంలో విరాట్‌ను మరో రికార్డు ఊరిస్తోంది. మరో 21 పరుగులు సాధిస్తే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో 2,000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఏడవ బ్యాటర్‌గా కోహ్లీ నిలవనున్నాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలలో ఇప్పటివరకు 24 టెస్టుల్లో 42 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన విరాట్ 48.26 సగటుతో 1979 పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు, 5 అర్ధ శతకాలు ఉన్నాయి. కోహ్లీ కంటే ముందు నలుగురు భారతీయ క్రికెటర్లు మాత్రమే ఈ రికార్డును సాధించారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు..
1. సచిన్ టెండూల్కర్ - 3,262
2. రికీ పాంటింగ్ - 2,555
3. వీవీఎస్ లక్ష్మణ్ - 2,434
4. రాహుల్ ద్రావిడ్ - 2,143
5. మైఖేల్ క్లార్క్ - 2,049
6. చెతేశ్వర్ పుజారా - 2,033
7. విరాట్ కోహ్లీ -1,979.
ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 (శుక్రవారం) నుంచి మొదలుకానుంది. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. కాగా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో ఫామ్ కోల్పోయి నానాతంటాలు పడుతున్నాడు. తిరిగి ఫామ్‌ను అందుకునేందుకు పెర్త్ మైదానం సరైన వేదిక అని మాజీలు విశ్లేషిస్తున్నారు. ఈ మైదానంలో అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉందని గుర్తుచేస్తున్నారు.