పాక్‌లో మహిళా క్రికెటర్లు బసచేసిన హోటల్‌లో అగ్నిప్రమాదం.. త్రుటిలో తప్పించుకున్న ఐదుగురు ప్లేయర్లు

  • జాతీయ మహిళా చాంపియన్‌షిప్ టోర్నీని నిర్వహిస్తున్న పీసీబీ
  • కరాచీలో ఓ హోటల్‌లో బస చేసిన ప్లేయర్లు
  • అదృష్టవశాత్తు ప్లేయర్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్న పీసీబీ
  • ప్రమాదం నేపథ్యంలో ట్రోఫీని కుదించిన బోర్డు
పాకిస్థాన్‌లోని కరాచీలో మహిళా క్రికెటర్లు బస చేసిన హోటల్‌లో నిన్న అగ్నిప్రమాదం సంభవించింది. ఐదుగురు ప్లేయర్లు త్రుటిలో ప్రాణాలతో తప్పించుకోగలిగారు. ఈ ప్రమాదం నేపథ్యంలో జాతీయ మహిళా చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌ను పీసీబీ నిలిపివేసింది. అగ్నిప్రమాదంతో క్రికెటర్లు భయంతో హడలిపోయారు. హోటల్‌లో అగ్ని ప్రమాదం నేపథ్యంలో జట్లకు మరో చోట వసతి ఏర్పాటు చేసేందుకు పీసీబీ ప్రయత్నిస్తోంది. అయితే, కరాచీలో డిఫెన్స్ ఎగ్జిబిషన్‌ జరుగుతున్న నేపథ్యంలో ఆటగాళ్లకు ప్రత్యామ్నాయ బస దొరకడం కష్టంగా మారింది. 

ఆటగాళ్ల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టోర్నమెంటును కుదించినట్టు పాక్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అదృష్టవశాత్తు అగ్ని ప్రమాదంలో ఆటగాళ్లు ఎవరూ గాయపడలేదని తెలిపింది. ఘటన జరిగిన సమయంలో హోటల్‌లో ఉన్న ఐదుగురు ప్లేయర్లను సురక్షితంగా తరలించినట్టు పేర్కొంది. టోర్నీని కుదించడంతో విజేతను నిర్ణయించేందుకు.. ఒక్కో జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడిన తర్వాత మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య ఫైనల్ నిర్వహించాలని నిర్ణయించింది. ఫైనల్ వేదిక, తేదీని త్వరలో ప్రకటిస్తామని పీసీబీ తెలిపింది. 


More Telugu News