విరాట్ కోహ్లీ క్రికెట్ కెరీర్‌పై సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీకి ఇదే చివరి సిరీస్ కావొచ్చన్న భారత మాజీ దిగ్గజం
  • బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పరుగులు సాధిస్తాడని విశ్వాసం వ్యక్తం చేసిన సౌరవ్ గంగూలీ
  • విరాట్ కోహ్లీ కచ్చితంగా ఒక ఛాంపియన్ బ్యాటర్ అని కితాబు 
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్‌లేమితో నానా తంటాలు పడుతున్న విషయం తెలిసిందే. విరాట్ తన క్రికెట్ కెరీర్‌లో పరుగులు సాధించలేక ఇంతలా సతమతం కావడం ఇదే తొలిసారి. గత 6 టెస్టుల్లోని 12 ఇన్నింగ్స్‌ల్లో 22.72 సగటుతో కేవలం 250 పరుగులు మాత్రమే సాధించాడంటే ఎంత దారుణంగా విఫలమవుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. దీంతో విరాట్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

ఆస్ట్రేలియాలో విరాట్‌ కోహ్లీకి ఇదే చివరి సిరీస్ కావొచ్చని గంగూలీ అభిప్రాయపడ్డాడు. విరాట్ వయసు ఇప్పటికే 36 ఏళ్లు అని, మరికొన్నేళ్ల తర్వాత ఆసీస్‌లో పర్యటించే భారత జట్టులో అతడు భాగం కాకపోవచ్చని విశ్లేషించాడు. 

ఫామ్ విషయంలో విరాట్‌కు గంగూలీ అండగా నిలిచాడు. ఆసీస్ సిరీస్‌లో తిరిగి ట్రాక్‌లోకి వస్తాడని, పరుగులు సాధిస్తూ జట్టును ముందుకు నడిపిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ కచ్చితంగా ఒక ఛాంపియన్ బ్యాటర్ అని అన్నాడు. ఈ మేరకు రెవ్‌స్పోర్ట్జ్‌తో మాట్లాడుతూ గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ నుంచి సానుకూల ప్రదర్శన ఆశించవచ్చా? అని ప్రశ్నించగా ఈ సమాధానం ఇచ్చాడు.

కాగా ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. 6 ఇన్నింగ్స్‌లలో కలిపి కనీసం 100 పరుగులు కూడా సాధించలేకపోయాడు. దీంతో విరాట్‌పై విమర్శలు పెరిగాయి. కాగా ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ ట్రాక్ రికార్డు బాగుంది. 13 టెస్టులు ఆడి 54.08 సగటుతో 1,352 పరుగులు సాధించారు. ఇందులో 6 సెంచరీలు కూడా ఉన్నాయి.


More Telugu News