‘కాగ్’ అధిపతిగా సంజయ్‌మూర్తి.. తొలి తెలుగు వ్యక్తిగా రికార్డ్!

‘కాగ్’ అధిపతిగా సంజయ్‌మూర్తి.. తొలి తెలుగు వ్యక్తిగా రికార్డ్!
  • ముగియనున్న ప్రస్తుత కాగ్ అధిపతి గిరీశ్‌చంద్ర ముర్ము పదవీకాలం
  • ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్‌మూర్తి
  • ఆయన సేవలను మెచ్చి కాగ్‌ అధిపతిగా నియమించిన కేంద్రం
  • సంజయ్‌మూర్తి తండ్రి కేఎస్ఆర్ మూర్తి అమలాపురం మాజీ ఎంపీ
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండ్రు సంజయ్‌మూర్తి నియమితులయ్యారు. కాగ్‌కు చీఫ్‌గా ఓ తెలుగు వ్యక్తి నియమితులవడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను 15వ కాగ్‌గా నియమించినట్టు కేంద్రం వెల్లడించింది. సంజయ్‌మూర్తి అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు. కేఎస్ఆర్ మూర్తి 1996లో కాంగ్రెస్ తరపున అమలాపురం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. అంతకుముందు ఆయన కూడా ఐఏఎస్ అధికారిగా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో సేవలు అందించారు.

సంజయ్‌మూర్తి 24 డిసెంబర్ 1964లో జన్మించారు. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. 1989లో ఐఏఎస్ అధికారిగా హిమాచల్‌ప్రదేశ్ క్యాడర్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన సెప్టెంబర్ 2021 నుంచి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా పనిచేస్తూ కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం అమలులో కీలక పాత్ర పోషిస్తున్నారు.

నిజానికి ఆయన వచ్చే నెలలో ఉద్యోగం నుంచి విరమణ పొందాల్సి ఉండగా ఆయన సేవలను మెచ్చిన ప్రభుత్వం కాగ్‌‌గా నియమించింది. గరిష్ఠంగా ఆరేళ్లు, లేదంటే 65 ఏళ్ల వయసు వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుత కాగ్ గిరీశ్‌చంద్ర ముర్ము పదవీకాలం త్వరలో ముగియనుంది.


More Telugu News