ఢిల్లీలో ఒక రోజు ఉంటే 49 సిగరెట్లు తాగినట్టే... మరి ఏపీ, తెలంగాణలో ఎంత?

  • ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిన వాయు కాలుష్యం
  • పరిశ్రమలు, వాహనాల రద్దీ ఉన్నచోట దారుణంగా పరిస్థితి
  • ఏ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందన్న దానిపై ‘ఏక్యూఐ’ వెబ్ సైట్ గణాంకాలు
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత దారుణ పరిస్థితికి చేరింది. ఇప్పటికే ప్రాథమిక పాఠశాలలు మూసివేసి, పిల్లలకు ఆన్ లైన్ లో తరగతులు నడిపిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి మరింత దిగజారిందని, ఏక్యూఐ స్థాయులు ఏకంగా 978కి చేరాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఢిల్లీలో ఒక రోజు (24 గంటలపాటు) ఉండి, ఆ వాయువులను పీల్చుకుంటే ఏకంగా 49 సిగరెట్లు తాగడంతో సమానమని పేర్కొంటున్నారు. గాలి కాలుష్యం, ఇతర వాతావరణ అంశాల సమాచారాన్ని అందించే ‘ఏక్యూఐ డాట్ ఇన్’ గణాంకాలు ప్రమాదకర పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయని వివరిస్తున్నారు.

ఏమిటీ ఏక్యూఐ?  
  • గాలిలోని దుమ్ము, ధూళి (పీఎం 2.5, పీఎం 10) కలుషితాలు, విషపూరిత వాయువుల శాతాన్ని పరిశీలించి... గాలి నాణ్యతను నిర్ధారిస్తారు. దీనిని ‘ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్)’గా పేర్కొంటారు. ఇది ఎంత  ఎక్కువగా ఉంటే... గాలి నాణ్యత అంత దారుణంగా ఉంటుందన్న మాట. 
  • దేశంలో ఏ రాష్ట్రంలో ఎంత ‘ఏక్యూఐ’ ఉందనే గణాంకాలను ‘ఏక్యూఐ డాట్ ఇన్’ వెబ్ సైట్ ప్రకటిస్తూ ఉంటుంది. 
  • ఏక్యూఐ డాట్ ఇన్... సోమవారం (నవంబర్ 18న) మధ్యాహ్నం ఢిల్లీలో 978 ఏక్యూఐ నమోదైంది. ఇది ఎంత కాలుష్యం అంటే.. అక్కడి గాలిని 24 గంటల పాటు పీలిస్తే, 49 సిగరెట్లు తాగిన దానితో సమానం.
  • హర్యానా 631 ఏక్యూఐతో రెండో స్థానంలో ఉంది. అంటే 24 గంటల పాటు గాలి పీల్చితే 33 సిగరెట్లు తాగినదానితో సమానం అన్నమాట.
  • గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్ (రోజుకు 10 సిగరెట్లు తాగినంత), ఉత్తర ప్రదేశ్ (9.5), ఒడిశా (7.5), బెంగాల్ (7.5), రాజస్థాన్ (7.5), పంజాబ్ (6.5), మధ్యప్రదేశ్ (5.5) తదితర రాష్ట్రాలు ఉన్నాయి.
  • దేశంలో లడక్, జమ్మూకాశ్మీర్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే గాలి పరిశుభ్రంగా ఉన్నట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి.

తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమిటి?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఏక్యూఐ విషయానికొస్తే... ప్రాంతాలను బట్టి 65 నుంచి 130 వరకు ఉంటుంది. ‘ఏక్యూఐ డాట్ ఇన్, ఇండియా ఇన్ పిక్సెల్స్’ సంస్థల గణాంకాల ప్రకారం... తెలంగాణ, ఏపీలలో గాలి కాలుష్యం రోజుకు రెండు సిగరెట్లు తాగినదానితో సమానం.

అంతటా కాలుష్యం ఉన్నట్టు కాదు

  • గాలిలో కలుషితాలు రోజులో వేర్వేరు సమయాల్లో వేర్వేరుగా ఉంటాయి. జనం, వాహనాల రద్దీ, ఫ్యాక్టరీలు పనిచేసే వేళల్లో ఎక్కువగా... అర్ధరాత్రి తర్వాత తక్కువగా ఉంటాయి.
  • ఏదైనా రాష్ట్రంలో ఏక్యూఐ ఎక్కువగా ఉంటే... అది రాష్ట్రమంతటా ఉన్నట్టు కాదు. కేవలం సగటు మాత్రమే.
  • పెద్ద నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నచోట ఏక్యూఐ అత్యధికంగా ఉంటుంది. అడవులు, పూర్తి గ్రామీణ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంటుంది.
  • ఉదాహరణకు తెలంగాణలోని హైదరాబాద్ లో... ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో ఏక్యూఐ ఎక్కువగా ఉంటుంది. మిగతా చోట్ల తక్కువగా ఉంటుంది.


More Telugu News