ఢిల్లీ ఆప్ ప్రభుత్వంలో కలకలం... మంత్రి పదవికి రాజీనామా చేసిన కైలాస్ గెహ్లాట్

  • ఢిల్లీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న కైలాస్ గెహ్లాట్
  • సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు
  • కేజ్రీవాల్ కు లేఖ రాసిన వైనం
ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాస్ గెహ్లాట్ సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇవాళ ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆప్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజాసంక్షేమం బాట నుంచి దారితప్పిందని ఆరోపిస్తూ, ఇకపై మంత్రిగా కొనసాగలేనంటూ కైలాస్ గెహ్లాట్ రాజీనామా ప్రకటన చేశారు. అంతేకాదు, పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. 

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా... ఆప్ పై ఈ పరిణామం ప్రభావం చూపనుంది. కైలాస్ గెహ్లాట్ ఇవాళ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు లేఖ రాశారు. కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు నివాసం ఉన్న భవనానికి రూ.45 కోట్లతో పునరుద్ధరణ పనులు అవసరమా అని తన లేఖలో ప్రశ్నించారు. 

ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవాళ ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని, ఈ సవాళ్లు బయటి నుంచి కాదని, పార్టీలోనే అని స్పష్టం చేశారు. ప్రజల పట్ల మన నిబద్ధతను రాజకీయ ప్రయోజనాలు తొక్కేస్తున్నాయి... ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావడంలేదు అంటూ కైలాస్ గెహ్లాట్ తన లేఖలో విమర్శనాస్త్రాలు సంధించారు.


More Telugu News