తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సత్తా.. విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు

  • ఒక ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచిన యువ బ్యాటర్
  • దక్షిణాఫ్రికాపై 4 మ్యాచ్‌ల్లోనే ఏకంగా 280 పరుగులు బాదిన తిలక్ వర్మ
  • ఇంగ్లండ్‌పై 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 231 పరుగులు సాధించిన కోహ్లీ రికార్డు బ్రేక్
తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో అదరగొట్టిన విషయం తెలిసిందే. నాలుగు మ్యాచ్‌లు ఆడి మొత్తం 280 పరుగులు బాదాడు. సిరీస్‌లో అతడి స్ట్రైక్ రేట్ 198 శాతానికి పైగానే ఉంది. రెండు శతకాలు కూడా నమోదు చేశాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ రికార్డును తిలక్ వర్మ బద్దలు కొట్టాడు. ఒక ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారతీయ బ్యాటర్‌గా యువ ఆటగాడు రికార్డు నెలకొల్పాడు.

ఇంగ్లండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌లో విరాట్ కోహ్లీ 115.50 సగటు, 147.13 స్ట్రైక్ రేట్‌తో 231 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 80 (నాటౌట్)గా ఉంది. అయితే విరాట్ సాధించిన 231 పరుగుల రికార్డును దక్షిణాఫ్రికా సిరీస్‌లో తిలక్ వర్మ అధిగమించాడు. మరో 49 పరుగులు ఎక్కువగా సాధించి చరిత్ర నెలకొల్పాడు.

కాగా దక్షిణాఫ్రికాతో ఇటీవలే ముగిసిన టీ20 సిరీస్‌లో తిలక్ వర్మ శభాష్ అనిపించుకున్నాడు. మూడు, నాలుగవ మ్యాచ్‌ల్లో వరుసగా సెంచరీలు సాధించాడు. ముఖ్యంగా జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన నాలుగవ టీ20 మ్యాచ్‌లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 47 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 255.32గా ఉంది. దీంతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులను దక్కించుకున్నాడు.


More Telugu News