నకిలీ బంగారం తనఖాపెట్టి పనిచేస్తున్న సంస్థనే మోసగించిన ఉద్యోగులు

  • విజయవాడ భవానీపురంలోని ఆక్సివా ఫిన్‌వెస్ట్ లిమిటెడ్‌లో ఘటన
  • ఖాతాదారులతో కలిసి కుమ్మక్కయిన ఉద్యోగులు
  • నకిలీ బంగారం తనఖా పెట్టి రెండు ఖాతాల ద్వారా రూ. 6.76 లక్షల రుణం
  • ఆడిట్‌లో మోసం వెలుగులోకి
  • నేరం ఒప్పుకుని తిరిగి చెల్లిస్తామని హామీ
  • ఆపై ఒక్కొక్కరుగా ఉద్యోగాలు మానేసిన వైనం
  • బ్రాంచి మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థనే దారుణంగా మోసగించారు. ఖాతాదారులతో కుమ్మక్కై నకిలీ బంగారం తనఖా పెట్టి దాదాపు రూ.7 లక్షలు రుణం తీసుకున్నారు. విజయవాడలోని భవానీపురంలో జరిగిందీ ఘటన. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో ఉద్యోగుల బాగోతం బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం.. భవానీపురం కాంబే రోడ్డులో కేఎల్ఎం ఆక్సివా ఫిన్‌వెస్ట్ లిమిటెడ్ కంపెనీ శాఖ ఉంది. దీని ప్రధాన కార్యాలయం కేరళలోని ఎర్నాకుళంలో ఉంది. భవానీపురం బ్రాంచిలో గంగిరెడ్డి సుబ్బారెడ్డి, కొక్కిలిగడ్డ హిమబిందు, మానస, రాళ్లబండి శివకుమార్, అప్రైజర్‌గా రాము మౌనిక పనిచేసేవారు. 

గంగిరెడ్డి, హిమబిందు, మానస భవానీపురానికి చెందిన ఊటుకూరు అన్నపూర్ణ, కబేళా ప్రాంతానికి చెందిన జలగం ధనలక్ష్మి, కాకునూరుకు చెందిన కొల్లి కృష్ణవేణితో కలిసి నకిలీ బంగారం తనఖా పెట్టి ఒక ఖాతాలో రూ. 5,66,118 రుణం తీసుకున్నారు. రాళ్లబండి శివకుమార్, రాము మౌనిక, వన్‌టౌన్‌కు చెందిన శివకుమార్‌మణి కలిసి నకిలీ బంగారం తనఖా పెట్టి మరో ఖాతాలో రూ. 1.10 లక్షలు తీసుకున్నారు. 

ఆడిట్‌లో మోసం వెలుగులోకి
ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ఆడిట్ అధికారులు రికార్డులు తనిఖీ చేయగా మోసం వెలుగుచూసింది. నిందితులను విచారించగా నేరం అంగీకరించారు. డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఉద్యోగాలు మానివేశారు. దీంతో బ్రాంచ్ మేనేజర్ షేక్‌లాల్ సాహెబ్ ఫిర్యాదు మేరకు అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులతోపాటు ఖాతాదారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News