పెర్త్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ

  • టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
  • ఐదు టెస్టుల సిరీస్ లో నవంబరు 22 నుంచి తొలి టెస్టు
  • ప్రాక్టీసు మ్యాచ్ లో గాయపడిన శుభ్ మాన్ గిల్
  • ఓపెనింగ్ స్లాట్ పై అనిశ్చితి
  • ఇంకా భారత్ లోనే ఉన్న రోహిత్ శర్మ... గాయంతో బాధపడుతున్న రాహుల్
నవంబరు 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో, టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. పెర్త్ టెస్టు ముంగిట యువ బ్యాట్స్ మన్ శుభ్ మాన్ గిల్ నెట్స్ లో గాయపడడం టీమిండియా కూర్పుపై ప్రభావం చూపనుంది. 

టీమిండియా ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి ప్రాక్టీసు మ్యాచ్ ఆడుతుండగా, గిల్ ఎడమచేతి బొటనవేలికి గాయమైంది. స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తుండగా గిల్ గాయపడ్డాడు. దాంతో మైదానం వీడిన గిల్ మళ్లీ ఫీల్డ్ లోకి రాలేదు. గాయం తీవ్రతపై స్పష్టత లేదు. 

అందుబాటులో ఉన్న సమాచారం మేరకు... గిల్ కు తగిలిన గాయం నయం కావాలంటే రెండు వారాలు పడుతుందని తెలుస్తోంది. దాంతో గిల్ తొలి టెస్టులో ఆడేది అనుమానంగా మారింది. గత కొంతకాలంగా టెస్టుల్లో టీమిండియా టాపార్డర్ కు గిల్ నిలకడ అందిస్తున్నాడు. వన్ డౌన్ లో స్థిరంగా రాణిస్తూ, పలు విజయాల్లో తనవంతు సహకారం అందించాడు. 

ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ భారత్ లోనే ఉండగా... తొలి టెస్టు సమయానికి అతడు పెర్త్ చేరుకోకపోతే... ఆ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ తో కలిసి శుభ్ మాన్ గిల్ ఓపెనర్ గా బరిలో దిగాల్సి ఉంది. ఇప్పుడు గిల్ కు గాయం కావడం టీమిండియా మేనేజ్ మెంట్ కు సమస్యగా మారింది. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుతో ఆడేటప్పుడు ఓపెనింగ్ భాగస్వామ్యం ఎంతో కీలకం. 

కేఎల్ రాహుల్ రూపంలో మరో ఓపెనింగ్ ఆప్షన్ అందుబాటులో ఉన్నప్పటికీ, ఇటీవల అతడి ఫామ్ దారుణాతిదారుణంగా ఉంది. దానికితోడు అతడు కూడా ప్రాక్టీసు మ్యాచ్ లో మోచేతికి బంతి తగలడంతో గాయపడ్డాడు. నవంబరు 22 నాటికి రాహుల్ కోలుకుంటాడా అనేదానిపై అనిశ్చితి నెలకొంది.


More Telugu News