పవన్ కు తమిళనాడు తెలుగు పీపుల్స్ ఫౌండేషన్ విన్నపం!

  • దేవరకొండ రాజు నేతృత్వంలో పవన్ ను కలిసిన బృందం
  • తమిళనాడులో తెలుగువారి పరిస్థితులను వివరించిన వైనం
  • చెన్నైలో తెలుగు భవనం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విన్నపం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను తమిళనాడు తెలుగు పీపుల్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు దేవరకొండ రాజు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కలిసింది. మంగళగిరిలోని పవన్ క్యాంపు కార్యాలయంలో ఆయనతో వీరు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమిళనాడులోని తెలుగువారి పరిస్థితుల గురించి పవన్ కు వీరు వివరించారు. 

చెన్నై, కాంచీపురం, కోయంబత్తూరు, మధురై, తిరుత్తణి, కృష్ణగిరి, తిరువళ్లూరు, చెంగల్పట్టు ప్రాంతాల్లో తెలుగువారు అధిక సంఖ్యలో ఉన్నారని డిప్యూటీ సీఎంకు వీరు వివరించారు. వివిధ రంగాల్లో తెలుగువారు స్థిరపడ్డారని తెలిపారు. 

జయలలిత సీఎంగా ఉన్న రోజుల్లో చెన్నైలో తెలుగు భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారని... అయితే, ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదని చెప్పారు. చెన్నైలో తెలుగు భవనం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని పవన్ ను తమిళనాడు తెలుగు పీపుల్స్ ఫౌండేషన్ ప్రతినిధులు కోరారు. 

తెలుగు పీపుల్స్ ఫౌండేషన్ తరపున తమిళనాడులో చేస్తున్న సామాజిక సేవలు, తెలుగు భాష, సంస్కృతి కోసం చేస్తున్న కృషిని పవన్ కు వివరించారు. వారు చేస్తున్న సేవలను పవన్ అభినందించారు. పవన్ ను కలిసిన వారిలో దేవరకొండ రాజుతో పాటు ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు, ఏఎం మనోజ్, ప్రియా శ్రీధర్, బి.రఘునాథ్ తదితరులు ఉన్నారు.


More Telugu News