రన్‌వేపై ట్రాక్టర్‌.. 40 నిమిషాలు గాల్లోనే విమానం

--
రన్ వే పై పెరిగిన గడ్డిని కోసేందుకు వచ్చిన ట్రాక్టర్ మొరాయించింది. దీంతో ఆ విమానాశ్రయంలో దిగాల్సిన విమానం దాదాపు 40 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. పాట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్ పోర్టులో జరిగిందీ ఘటన.

పాట్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వే కు దగ్గర్లో గడ్డి కోసేందుకు తెప్పించిన ట్రాక్టర్ కాస్తా బురదలో దిగబడింది. ఎటూ కదలకుండా మధ్యలోనే ఆగిపోవడంతో దానిని బయటకు తెచ్చేందుకు విమానాశ్రయ సిబ్బంది నానా ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో కోల్ కతా నుంచి పాట్నాకు ఇండిగో విమానం చేరుకుంది. అయితే, రన్ వే కు సమీపంలో ట్రాక్టర్ ఉండడంతో కిందకు దిగే పరిస్థితి లేకపోయింది.

దీంతో అధికారుల అనుమతి కోసం ఎదురుచూస్తూ పైలట్ ఆ విమానాన్ని ఎయిర్ పోర్ట్ మీదుగా అటూ ఇటూ తిప్పుతూ ఉండిపోయాడు. దాదాపు నలభై నిమిషాల తర్వాత ట్రాక్టర్ ను అధికారులు బయటకు తీయడంతో విమానం క్షేమంగా ల్యాండ్ అయింది. విమానం గాల్లో చక్కర్లు కొడుతున్న సమయంలో ఆందోళనకు గురైన ప్రయాణికులు.. రన్ వే పై విమానం సేఫ్ గా ల్యాండవడంతో ఊపిరి పీల్చుకున్నారు.


More Telugu News