ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన సంజు శాంసన్, తిలక్ వర్మ

  • దక్షిణాఫ్రికాపై 4వ టీ20లో 210 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన భారత బ్యాటర్లు
  • భారత్ తరపున ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక పార్టనర్‌షిప్
  • ప్రపంచ టీ20 క్రికెట్‌లో 2వ వికెట్‌కు ఇదే అతిపెద్ద భాగస్వామ్యంగా రికార్డు నమోదు
జోహన్నెస్‌బర్గ్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో టీమిండియా బ్యాటర్లు సంజూ శాంసన్, తిలక్ వర్మ సంచలన బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. సిక్సర్లు, ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసి చెరో సెంచరీ సాధించారు. శాంసన్ 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 56 బంతుల్లో 109 పరుగులు సాధించాడు. ఇక తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 47 బంతుల్లోనే 120 పరుగులు సాధించాడు. తన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. కడవరకు నాటౌట్‌గా నిలిచిన వీరిద్దరు రెండవ వికెట్‌కు ఏకంగా 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో పలు క్రికెట్ రికార్డులు బద్దలయ్యాయి.

టీ20 ఫార్మాట్‌లో భారత్‌ తరపున ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యంగా సంజూ-తిలక్ వర్మ పార్ట్‌నర్‌షిప్ నిలిచింది. అంతేకాదు టీ20లలో దక్షిణాఫ్రికాపై ఇదే అతిపెద్ద పార్టనర్‌షిప్‌గా రికార్డులకెక్కింది. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రెండవ వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యంగా ప్రపంచ రికార్డు నమోదయింది. వీరిద్దరూ కలిసి 210 పరుగుల పార్టనర్‌షిప్‌ని కేవలం 93 బంతుల్లోనే నెలకొల్పడం మరో విశేషంగా ఉంది.

ఒకే టీ20 మ్యాచ్‌లో ఇద్దరు భారత బ్యాటర్లు సెంచరీలు సాధించడం కూడా ఇదే తొలిసారి. సంజూ శాంసన్‌కు టీ20 కెరీర్‌లో ఇది మూడవ శతకం. ఇదే సిరీస్ తొలి మ్యాచ్‌లో కూడా సెంచరీ సాధించాడు. ఇక యువ బ్యాటర్ తిలక్ వర్మ వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు బాదాడు. మూడవ టీ20లో కూడా శతకం బాదిన విషయం తెలిసిందే.


More Telugu News