శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ గెలుపు

  • శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే నేతృత్వంలో అధికార ఎన్‌పీపీ గెలుపు
  • 107 సీట్లు గెలుచుకున్న ఎన్‌పీపీ కూటమి
  • కుటుంబ పాలన పార్టీలకు చెక్ పెట్టిన అనుర కుమార దిసానాయకే
గురువారం జరిగిన శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే నేతృత్వంలోని అధికార నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ) మెజారిటీ సాధించింది. శ్రీలంక ఎన్నికల కమిషన్ ప్రకారం.. ఎన్‌పీపీ సారధ్యంలోని కూటమి 107 సీట్లు గెలుచుకుంది. దాదాపు 62 శాతం లేదా 6.8 మిలియన్ ఓట్లు కూటమికి వచ్చినట్టు శ్రీలంక ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌ తాజా డేటా పేర్కొంది. దీంతో మూడింట రెండొంతుల మెజారిటీకి కూటమి చేరువైంది. కాగా రాజధాని కొలంబో శివార్లలో ఎన్‌పీపీ మద్దతుదారులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు.

విపక్ష నేత సజిత్ ప్రేమదాస నేతృత్వంలోని సమగి జన బలవేగయ పార్టీ 28 సీట్లు గెలుచుకుంది. పోలైన ఓట్లలో ఆ పార్టీకి దాదాపు 18 శాతం ఓట్లు వచ్చాయి. ఇక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే మద్దతు ఉన్న న్యూ డెమోక్రటిక్ ఫ్రంట్ కేవలం మూడు సీట్లు మాత్రమే గెలుచుకుంది.

కాగా శ్రీలంక పార్లమెంట్‌లో మొత్తం 225 సీట్లు ఉన్నాయి. దామాషా ప్రాతినిధ్య విధానం ప్రకారం 196 మంది సభ్యులను ఓటర్లు నేరుగా పార్లమెంటుకు ఎన్నుకుంటారు. ఇక మిగిలిన 29 స్థానాలను దామాషా ఓటు ప్రకారం భర్తీ చేస్తారు. పార్టీలకు వచ్చిన ఓటు శాతం ప్రకారం సీట్లు కేటాయిస్తారు.

కాగా శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న కుటుంబ పార్టీలను విపక్షానికి పరిమితం చేశారు. తాజా ఎన్నికల ఓటింగ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇది శ్రీలంకకు ముఖ్యమైన మలుపుగా మేము భావిస్తున్నాం. బలమైన ప్రభుత్వ ఏర్పాటుకు ఈ తీర్పు దోహదపడుతుందని మేము ఆశిస్తున్నాం. ఈ మేరకు ప్రజలు మాకు అనుకూలంగా తీర్పు ఇస్తారని మేము విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.


More Telugu News