ఐపీఎల్ వేలానికి ముందు ఫ్రాంచైజీలన్నీ తనవైపు చూసేలా చేసిన అర్జున్ టెండూల్కర్

  • రంజీ ట్రోఫీలో తొలిసారి 5 వికెట్ల ఫీట్ సాధించిన సచిన్ తనయుడు
  • అరుణాచల్ ప్రదేశ్‌‌ను 84 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర
  • గోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలం మరికొన్ని రోజుల్లోనే జరగనుంది. నవంబర్ 24-25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నిర్వహించనున్నారు. ఈ మెగా ఆక్షన్‌కు ముందు తనపై అంచనాలను పెంచుతూ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అదరగొట్టాడు. రంజీ ట్రోఫీలో గోవా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ పేసర్... అరుణాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెరీర్‌లో తొలిసారి 5 వికెట్ల ఫీట్ అందుకున్నాడు.

ఆట మొదటి రోజున ప్రత్యర్థిని 84 పరుగులకే ఆలౌట్ చేయడంలో అర్జున్ టెండూల్కర్ కీలక పాత్ర పోషించాడు. 25 పరుగులు మాత్రమే ఇచ్చి 5 కీలకమైన వికెట్లు తీశాడు. గోవా బౌలర్లు మోహిత్ 3, కీత్ పింటో 2 వికెట్లతో తమవంతు సహకారం అందించడంతో అరుణాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 30.3 ఓవర్లలోనే ముగిసింది.

రంజీ ట్రోఫీకి ముందు జరిగిన డాక్టర్ కే.తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నమెంట్‌లో కూడా అర్జున్ టెండూల్కర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆతిథ్య కర్ణాటకపై రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు తీశాడు. దీంతో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన ప్రదర్శనను మెరుగుపరచుకున్నట్టు సంకేతాలు ఇచ్చాడు. కాగా ముంబై ఇండియన్స్ యాజమాన్యం అర్జున్ టెండూల్కర్‌ను రిటెయిన్ చేసుకోలేదు. దీంతో ఐపీఎల్ మెగా వేలంలో అందుబాటులో ఉండనున్న అతడిపై ఫ్రాంచైజీలు కన్నేసే సూచనలు ఉన్నాయి.


More Telugu News