వయనాడ్‌లో 5 గంటల వరకు 60 శాతానికి పైగా పోలింగ్ నమోదు

  • వయనాడ్ లోక్ సభ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ప్రియాంక గాంధీ
  • 10 రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు కూడా ఈరోజే ఉపఎన్నికలు
  • ఝార్ఖండ్‌లో ముగిసిన మొదటి దఫా అసెంబ్లీ ఎన్నికలు
కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం ఉప ఎన్నికకు సంబంధించి ఈరోజు పోలింగ్ జరిగింది. సాయంత్రం ఐదు గంటల వరకు 60 శాతానికి పైగా పోలింగ్ నమోదయింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. 

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 10 రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు ఉప ఎన్నికలు జరిగాయి. ఝార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాలకు గాను 43 నియోజకవర్గాలకు ఈ రోజు ఎన్నికలు జరిగాయి.

ప్రధానంగా అందరి దృష్టి ప్రియాంక గాంధీ పోటీ చేసిన వయనాడ్ వైపు ఉంది. ఇక్కడ సాయంత్రం 5 గంటల వరకు 60.79 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి చాలామంది ఓటర్లు ఓటు వేసేందుకు వరుసలో నిలుచున్నారు. వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ జరిగింది. పలుచోట్ల ఈవీఎం మెషీన్లలో స్వల్ప సమస్యలు తలెత్తాయి. 

ఇక, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 64.86 శాతం ఓటింగ్ నమోదైంది.

వయనాడ్ లోక్ సభ స్థానంతో పాటు రాజస్థాన్‌లో ఏడు, పశ్చిమ బెంగాల్‌లో ఆరు, అసోంలో ఐదు, బిహార్‌లో నాలుగు, కేరళలో మూడు, మధ్యప్రదేశ్‌లో రెండు, మేఘాలయ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకల్లో ఒక్కో సీటుకు నేడు ఉప ఎన్నికలు జరిగాయి. 


More Telugu News