లగచర్ల ఘటన... పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

  • 46 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు
  • ఏ-1గా భోగమోని సురేశ్‌ను పేర్కొన్న పోలీసులు
  • దాడి, హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు వెల్లడి
వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటనలో పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పేర్కొన్నారు. 46 మందిని నిందితులుగా ఈ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఏ-1గా భోగమోని సురేశ్ పేరును పేర్కొన్న పోలీసులు... 16 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అధికారులపై దాడి, హత్యాయత్నం కేసుగా నమోదు చేశామని, దర్యాఫ్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఈ నెల 11న లగచర్లలో జరిగిన ఘటనపై డీఎస్పీ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారని, ఈ ఫిర్యాదు మేరకు విచారణ జరుగుతోందని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఫార్మా పరిశ్రమ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ కోసం జిల్లా కలెక్టర్ సహా ఇతర అధికారులు వచ్చిన సమయంలో కొంతమంది కర్రలు, రాళ్లతో దాడి చేశారని అందులో పేర్కొన్నారు. అడిషనల్ కలెక్టర్ లింగయ్య నాయక్, కడా అధికారి వెంకట్ రెడ్డిపై హత్యాయత్నం చేసినట్లు తెలిపారు.

రాళ్ల దాడి కారణంగా కలెక్టర్, పలువురు అధికారులు, పోలీసులకు గాయాలైనట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఫార్మా పరిశ్రమపై అభిప్రాయ సేకరణ కోసం ఘటన జరిగిన రోజున ఉదయం 11 గంటలకు అడిషనల్ కలెక్టర్ లింగయ్య, తాండూరు ఇంఛార్జ్ కలెక్టర్ ఉమాశంకర్, తహసీల్దారు కిషన్ నాయక్, విజయ్ కుమార్, కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి లగచర్లకు వచ్చినట్లు పేర్కొన్నారు.

మొదట గ్రామ శివారులో గ్రామసభను ఏర్పాటు చేశారని, అనంతరం సురేశ్ అనే వ్యక్తి కలెక్టర్ సహా ఇతర అధికారులను గ్రామంలోకి తీసుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ గ్రామంలోకి వెళ్లిన సమయంలో అందరూ గుమికూడి... వాహనాన్ని అడ్డగించారని, పెద్ద ఎత్తున నినాదాలు చేశారని వెల్లడించారు. కలెక్టర్ కారు దిగి వారి వద్దకు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా... దాడి చేశారని, కారుపై రాళ్లు రువ్వారని పేర్కొన్నారు. ఘటనలో ఉపయోగించిన రాళ్లు, కర్రలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఘటనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


More Telugu News