రోజుకో గుడ్డు తింటే... గుండెకు మంచిదేనా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?

  • గుడ్ల నుంచి అన్ని రకాల పోషకాలు అందే వీలు
  • అధిక ప్రొటీన్లు, కొలెస్ట్రాల్ వల్ల కొన్ని రకాల ఇబ్బందులు
  • గుండె జబ్బులున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుల సూచనలు
గుడ్లు సంపూర్ణ పోషకాహారం అని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నదే. రోజుకు ఒక గుడ్డుతో మంచి ఆరోగ్యం సొంతమవుతుందన్నది వైద్యులు కూడా చెబుతున్నదే. కానీ ఇటీవలి కాలంలో మధుమేహం, కొలెస్ట్రాల్ పెరగడం, గుండె జబ్బుల సమస్యల నేపథ్యంలో కోడిగుడ్ల వినియోగంపై భిన్నమైన అభిప్రాయాలు ఎన్నో ప్రచారంలోకి వస్తున్నాయి. మరి రోజుకో గుడ్డు తింటే మన గుండెకు మంచిదేనా? దానివల్ల జరిగే మేలు, కీడు ఏమిటో... శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో తెలుసుకుందామా...

గుడ్లతో ప్రయోజనాలేమిటో, ఇబ్బందేమిటో..
  • గుడ్లలో కార్బోహైడ్రేట్లు తక్కువ. ప్రొటీన్లు ఎక్కువ. అంతేకాదు మన శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు గుడ్లలో ఉంటాయి. అందుకే వాటిని సంపూర్ణ ఆహారం అంటారు.
  • గుడ్లలోని విటమిన్ ఏ, విటమిన్ బీ12, సెలీనియం వంటివి మన రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండేందుకు తోడ్పడుతాయి.
  • మన శరీరంలో గుండె ఆరోగ్యానికి కీడు చేసే హెమోసిస్టీన్ అనే అమైనో ఆమ్లాన్ని బ్రేక్ చేయగల ఖోలైన్ అనే ప్రొటీన్ గుడ్లలో ఉంటుంది. అంటే గుండెకు చెడు చేసే పదార్థాన్ని తొలగిస్తుంది.
  • అంతేకాదు ఖోలైన్ ప్రొటీన్ మెదడును ఉత్తేజితంగా ఉంచే న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా మెదడు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.
  • వయసు మీదపడటం వల్ల వచ్చే అంధత్వం, కండరాల క్షీణతను నివారించగల ల్యూటిన్, జియాక్సంథిన్ వంటి ఎంజైములు గుడ్లలో ఉంటాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. చర్మం ముడతలు పడకుండా తోడ్పడుతాయి.

మరి గుండె ఆరోగ్యం సంగతేమిటి?
  • గుడ్ల నుంచి వచ్చే కేలరీలు తక్కువే. అదే సమయంలో శరీరానికి అత్యవసరమైన ప్రోటీన్లు ఎక్కువ. డైటింగ్ చేసేవారికి ఇది మంచి ఆప్షన్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఉడికించుకుని తినే ఒక గుడ్డు నుంచి 78 కేలరీలు మాత్రమే వస్తాయి. నూనెలు, ఇతర పదార్థాలు కలిపి చేసే వంటల్లో ఆయా పదార్థాల కేలరీలు కలుస్తాయి. కాబట్టి ఉడకబెట్టిన గుడ్డుతో మేలు ఎక్కువ.
  • పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు నిత్యం గుడ్డు తీసుకోవడం వల్ల పెద్దగా సమస్య ఏమీ ఉండదని.. గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • గుడ్లలోని ప్రొటీన్లు, అమైనో ఆమ్లాల వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. గుండె జబ్బులు ఉన్నవారు ఉడికించిన గుడ్లలోని తెల్లని భాగాన్ని తీసుకుని... మధ్యలోని పసుపు పచ్చని భాగాన్ని వదిలేస్తే సరిపోతుందని స్పష్టం చేస్తున్నారు.
  • గుడ్లలో ప్రోటీన్లు ఎక్కువ కావడం, ఫైబర్ లేకపోవడం వల్ల... అధికంగా గుడ్లు తింటే గ్యాస్, జీర్ణ సమస్యలు, కడుపునొప్పి వంటివి వచ్చే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. అంతేకాదు.. నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లీవర్ (కాలేయ వ్యాధి) వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.


More Telugu News