కొత్త వాహనం కొనుగోలుపై తెలంగాణ ప్రభుత్వం బంపరాఫర్.. త్వరలోనే కొత్త పాలసీ అమల్లోకి!

  • జనవరి ఒకటో తేదీ నుంచి వెహికల్ స్క్రాపింగ్ పాలసీ!
  • కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మారిస్తే సర్టిఫికెట్
  • అది చూపించి కొత్త వాహనాలు కొనుగోలు చేస్తే డిస్కౌంట్
  • పర్యావరణ పరిరక్షణలో భాగంగానే నిర్ణయం
కాలం చెల్లిన వాహనాలు రోడ్డెక్కి పర్యావరణానికి హాని కలిగిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి కొత్తగా వాహన తుక్కు (స్క్రాపింగ్) విధానాన్ని తీసుకు రావాలని నిర్ణయించింది. ఈ విధానంలో భాగంగా వాహనదారుడు తన కాలం చెల్లిన వాహనాన్ని తుక్కుగా మారిస్తే అధికారులు స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఇస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేసేటప్పుడు ఆ సర్టిఫికెట్ చూపిస్తే రాయితీ లభిస్తుంది. కర్బన ఉద్గారాలను వెదజల్లుతున్న పాత వాహనాల స్థానంలో ఎకో ఫ్రెండ్లీ (పర్యావరణ హితం) వాహనాల వైపు మళ్లేందుకు వాహనదారులను ప్రోత్సహించడంలో భాగంగానే ఈ విధానం తీసుకొస్తోంది.

పాత వాహనాలను తుక్కు చేసేందుకు నగర శివారులోని శంషాబాద్, నందిగామ, తూప్రాన్‌లలో స్క్రాపింగ్ ప్లాంట్లు పెట్టాలని నిర్ణయించింది. తుక్కు ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు పలు కంపెనీలు ఇప్పటికే ముందుకొచ్చాయి. వీటిలో రెండుమూడు కంపెనీలు ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేశాయి. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చే వెహికల్ స్ర్కాపింగ్ విధానంతో కాలుష్యం గణనీయంగా తగ్గడంతోపాటు రోడ్డు ప్రమాదాలకు కూడా అడ్డుకట్ట పడుతుందని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. 


More Telugu News