పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై స్పందించిన కేటీఆర్, హరీశ్ రావు

  • ప్రజల తిరుగుబాటును బీఆర్ఎస్‌కు ఆపాదించే కుట్ర అన్న కేటీఆర్
  • ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు తప్పవని బెదిరిస్తున్నారని వ్యాఖ్య
  • వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన హరీశ్ రావు
లగచర్ల ఘటనలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రులు, ఆ పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్ రావు ఖండించారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతకాని పాలనకు నిదర్శనమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

‘‘ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్‌కు ఆపాదించే కుట్ర. కార్యకర్తలతో మాట్లాడినా ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది. ప్రజలు తిరగబడుతుంటే వారిని అణచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారు. పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు తప్పవని బెదిరిస్తున్నారు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుంది’’ అని కేటీఆర్ అన్నారు.

రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని కేటీఆర్ హెచ్చరించారు. ఉద్యమకాలం నుంచి ఇలాంటి నిర్బంధాలు, అక్రమ అరెస్టును బీఆర్ఎస్ ఎన్నో చూసిందని అన్నారు. ఎంత అణచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తామని అన్నారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, వెంటనే ఆయనతో పాటు లగచర్లలో అరెస్ట్ చేసిన రైతులను కూడా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు దుర్మార్గం: హరీశ్ రావు
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చని పొలాల్లో ఫార్మాసిటీ పేరిట చిచ్చుపెట్టడమే ప్రజాపాలనా అని ప్రశ్నించారు.

‘‘నడి రాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌లో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా? ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణచివేయలేరు. మీ బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు. ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతాం. ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటాం. అరెస్టు చేసిన పట్నం నరేందర్ రెడ్డిని, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారు.

కాగా ఇవాళ (బుధవారం) మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


More Telugu News