కారు సైడ్ మిర్రర్ లో ‘కనిపించే దానికంటే దగ్గర’ అనే వార్నింగ్ ఏమిటో తెలుసా?

  • వాహనాలను గమనించేందుకు సైడ్ మిర్రర్ల తోడ్పాటు
  • వాటిలో ఉండే స్వల్ప కుంభాకార అద్దాలతో ఎక్కువ ప్రదేశం చూడగలిగే అవకాశం
  • అందులో దగ్గరగా ఉన్న వస్తువులు కూడా దూరంగా కనిపించే తీరు
కారు నడుపుతున్నప్పుడు వెనుక నుంచి, పక్కల నుంచి ఎవరైనా వస్తున్నారా? అని గమనించేందుకు సైడ్ మిర్రర్లు ఉండటం అందరికీ తెలిసిందే. వాటిపై ‘The objects in the mirror are closer than they appear’ అని హెచ్చరిక ఉండటాన్ని గమనించారా? ‘ఈ అద్దంలో కనిపిస్తున్నవన్నీ అందులో కనిపిస్తున్నంత దూరం కంటే బాగా దగ్గరగా ఉంటాయి’ అని అర్థం. ఈ హెచ్చరిక ఎందుకోసమో, దానికి కారణమేంటో ఎప్పుడైనా ఆలోచించారా?

కాస్త కుంభాకార అద్దాలు కావడం వల్ల..
  • మామూలు అద్దాలు ఏవైనా నిజ ప్రతిబింబాన్ని చూపిస్తాయి. అంటే అన్నీ అచ్చం ఉన్నవి ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఎంత దూరంలో ఉండేది కచ్చితంగా మనకు అర్థమైపోతుంటుంది. అయితే ఈ అద్దాల్లో ఏర్పడే ప్రతిబింబం కొంత ప్రదేశం మేరకే ఉంటుంది.
  • కార్లు, ఇతర వాహనాల సైడ్ మిర్రర్లుగా వాడే అద్దాలు మధ్యలో అతి స్వల్పంగా ఉబ్బెత్తుగా ఉంటాయి. వాటిని కుంభాకార అద్దాలు అని చెప్పుకోవచ్చు. ఈ కుంభాకార అద్దాల ప్రత్యేకత ఏమిటంటే.. మామూలు అద్దాల కంటే కాస్త ఎక్కువ ప్రదేశాన్ని ప్రతిబింబిస్తాయి. 
  • అయితే ఈ కుంభాకార అద్దాలతో ఉండే సమస్య ఏమిటంటే... అందులో కనిపించే ప్రతిబింబం, సాధారణ అద్దాల్లో కనిపించే నిజ ప్రతిబింబం కన్నా చిన్నగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే... వస్తువులన్నీ చిన్నగా, దూరంగా ఉన్నట్టు కనిపిస్తాయి. నిజానికి అవి కాస్త దగ్గరగా, పెద్దగా ఉంటాయి. 

ఏమిటీ ప్రమాదం?
ఎప్పుడైనా ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేయాలని చూసినప్పుడుగానీ, పార్కింగ్ చేసినప్పుడుగానీ, ఏదైనా మలుపు తీసుకుంటున్నప్పుడుగానీ... మనం సైడ్ మిర్రర్ లో చూస్తాం. వెనకాల వాహనాలేవీ లేకుంటే, లేదా దూరంగా ఉన్నట్టు అనిపిస్తే.. ఓవర్ టేకింగో, మలుపో తీసుకుంటాం. అయితే సైడ్ మిర్రర్ లో దూరంగా కనిపించే వాహనం నిజానికి కాస్త దగ్గరగా ఉంటుంది. అదేదో దూరంగా ఉందని అనుకుని మనం ఓవర్ టేక్ చేసినా, మలుపు తిప్పినా... యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇందుకోసమే సైడ్ మిర్రర్లపై హెచ్చరికను ముద్రిస్తారు.
  • నిత్యం వాహనాలు నడిపేవారికి ఇది బాగానే తెలిసి ఉంటుంది. కొత్తగా నేర్చుకునేవారు, అప్పుడప్పుడూ నడిపేవారు మాత్రం ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి.


More Telugu News