లగచర్ల ఘటనలో కీలక పరిణామం.. పోలీసుల అదుపులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

  • పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • లగచర్ల దాడి ఘటనలో ప్రమేయం ఉందంటూ ఆయనపై ఆరోపణలు
  • ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలింపు
సీఎం రేవంత్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం సోమవారం నిర్వహించిన భూ సేకరణ ప్రజాభిప్రాయ సమావేశం రణరంగంగా మారిన విషయం తెలిసిందే. భూములు ఇవ్వబోమంటూ లగచర్ల గ్రామస్థులు నిరసన తెలుపుతూ కలెక్టర్ సహా అధికారులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనపై నమోదైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 

బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
  
కాగా లగచర్లలో అధికారులపై దాడికి పాల్పడిన 55 మందిని పోలీసులు నిన్న (మంగళవారం) గుర్తించారు. అందరినీ అదుపులోకి తీసుకున్నారు. కాగా భూసేకరణ అభిప్రాయం కోసం కలెక్టర్‌తో పాటు వెళ్లిన ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని పట్టుకుని గ్రామస్థులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వారి నుంచి తప్పించుకున్న వెంకట్‌రెడ్డి పొలాల వెంట పరుగులు పెట్టారు. ఆయనను కాపాడేందుకు ప్రయత్నించిన డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డిపై కూడా రైతులు దాడి చేశారు. ఈ దాడి ఘటనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.


More Telugu News