ఝార్ఖండ్‌లో మొదలైన తొలి దశ ఎన్నికలు.. ప్రియాంక గాంధీ పోటీ చేసిన వయనాడ్‌లోనూ మొదలు

  • 43 నియోజకవర్గాల్లో మొదలైన పోలింగ్
  • 10 రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకూ ఓటింగ్ మొదలు
  • పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం
ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ మొదలైంది. ఇవాళ (బుధవారం) ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొత్తం 81 నియోజకవర్గాలు ఉండగా 43 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఇక దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు, కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి కూడా ఉప ఎన్నికల పోలింగ్ షురూ అయింది. రాజస్థాన్‌లో 7, పశ్చిమ బెంగాల్‌లో 6, అస్సాంలో 5, బీహార్‌లో 4, కేరళలో 3, మధ్యప్రదేశ్‌లో 2, మేఘాలయ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకలో ఒక్కో సీటుకు పోలింగ్ జరుగుతోంది. కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తున్న విషయం  తెలిసిందే.

ఝార్ఖండ్‌తో పాటు ఉప ఎన్నికల పోలింగ్‌కు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన భద్రత కోసం పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. కాగా ఝార్ఖండ్‌లో రెండో దశ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక్కడ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం పార్టీ అత్యధికంగా 30 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 25 స్థానాలకు పరిమితమైంది. జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి మొత్తం 47 సీట్లతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.


More Telugu News