చంద్రబాబు, నితీశ్ లాంటి వారు ఉంటే...!: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

  • చంద్రబాబు లాంటి వారు ఉంటే కాంగ్రెస్ నుంచి ఏడాదిలో ప్రధాని వస్తారన్న సీఎం
  • జనరేషన్ గ్యాప్ కారణంగా ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని వ్యాఖ్య
  • ప్రస్తుతం స్విగ్గీ పాలిటిక్స్ నడుస్తున్నాయన్న రేవంత్ రెడ్డి
  • దేశం పట్ల నిబద్ధత కలిగి ఉండటాన్ని ఏబీవీపీ నుంచి నేర్చుకున్నానని వ్యాఖ్య
చంద్రబాబు, నితీశ్ కుమార్ లాంటి వారు మద్దతిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడాది లోగా ప్రధానిమంత్రి వస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా, కాంగ్రెస్ నుంచి తదుపరి ప్రధాని రావడానికి ఇంకెంత కాలం పడుతుందని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి రేవంత్ రెడ్డి పైవిధంగా సమాధానం ఇచ్చారు.

స్విగ్గీ పాలిటిక్స్ నడుస్తున్నాయి

జనరేషన్ గ్యాప్ కారణంగా ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం స్విగ్గీ పాలిటిక్స్ నడుస్తున్నాయని ఆయన ఆసక్తికర పోలిక తెచ్చారు. గతంలో ఇంట్లో అమ్మ, నానమ్మ భోజనం పెడితే తినేవారని... ఇప్పుడు స్విగ్గీలో ఆర్డర్ పెడితే రెండు నిమిషాల్లో వస్తుందన్నారు. ఇప్పుడు రాజకీయాలు అలాగే ఉన్నాయన్నారు. ప్రస్తుతం సిద్ధాంతపరమైన రాజకీయాలు తక్కువగా ఉన్నాయన్నారు. 

ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా ఇప్పటి వరకు తెలంగాణలోని భద్రాచల రాముడి దర్శనం చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న నీటి సహా ఇతర సమస్యలపై విన్-విన్ పద్ధతిలో పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పారు.

గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 400కు పైగా సీట్లు గెలుచుకుంటామని చెప్పిందని, కానీ 240 వద్ద ఆగిపోయిందన్నారు. ఇది బీజేపీ ఓటమిగా తాను భావించడం లేదని... మోదీ ఓటమే అన్నారు.  కాంగ్రెస్ వరుసగా ఓడిపోతున్నప్పటికీ రాహుల్ గాంధీ ఫీల్డ్‌ను వదలలేదన్నారు.

ఏబీవీపీలో దేశం పట్ల నిబద్ధతను నేర్చుకున్నా

ఏబీవీపీలో తాను దేశం పట్ల నిబద్ధతతో ఎలా ఉండాలో నేర్చుకున్నానని, తెలుగుదేశంలో అభివృద్ధి, సంక్షేమం గురించి తెలుసుకున్నానని, కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం ఉందని వ్యాఖ్యానించారు. ఉత్తరాది నుంచి ఏ సెలబ్రిటీని మీ క్యాంపెయిన్ కోసం తీసుకోవాలనుకుంటారని మీడియా ప్రతినిధి నలుగురి పేర్లను రేవంత్ రెడ్డి ముందు ఉంచారు. అయితే బాలీవుడ్, క్రికెట్ క్రీడాకారులను ప్రజలు చూసేందుకు మాత్రమే వచ్చారని, కానీ ఓట్లు మాత్రం పడవన్నారు.


More Telugu News