వారి భుజాలపై తుపాకి పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఫైర్ చేయాలనే కుట్ర: కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు

  • ఇటీవల రేవంత్ నియోజకవర్గంలోనే రెండు ఘటనలు జరిగాయన్న సీపీఐ నేత
  • రెండూ అక్కడే జరిగాయంటే బీజేపీ, బీఆర్ఎస్ కుట్రగా భావిస్తున్నామని వ్యాఖ్య
  • ఈ దాడుల వెనుక ఎవరు ఉన్నారో తేలాలన్న కూనంనేని
పేదల భుజాలపై తుపాకి పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఫైర్ చేయాలనే కుట్ర కనిపిస్తోందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీఐ సీనియర్ నేత నారాయణతో కలిసి కూనంనేని మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే ఇటీవల రెండు ఘటనలు జరిగాయన్నారు. అక్టోబర్ 25న ఒక ఘటన, తాజాగా వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి రెండో ఘటన అన్నారు.

ఈ రెండూ రేవంత్ నియోజకవర్గంలోనే జరిగాయంటే దీని వెనుక బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర ఉందని భావిస్తున్నామన్నారు. ఈ దాడుల వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలన్నారు. అదే సమయంలో రైతులకూ న్యాయం జరగాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి రాజకీయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.

కలెక్టర్‌పై దాడిని ఖండించిన నారాయణ

వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడిని నారాయణ ఖండించారు. తమ భూములు కోల్పోతామనే ఆవేదన, భయంతో రైతులు, ప్రజలు కలెక్టర్‌పై దాడి చేసినట్లు భావిస్తున్నామని చెప్పారు. ఆలయాలపై, అధికారులపై దాడుల వెనుక రాజకీయ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాలను ప్రోత్సహించేందుకు చేపడుతున్న కులగణనకు మద్దతు తెలిపారు. అయితే 75 ప్రశ్నలతో కూడిన ఆస్తులు, అప్పులు, బ్యాంకు లావాదేవీల వివరాలు ఎందుకో చెప్పాలని నిలదీశారు. తమ పార్టీ ఏ పార్టీకి రక్షణ కవచం కాదని, ప్రజలకు మాత్రమే రక్షణ కవచంగా ఉంటుందన్నారు.


More Telugu News