కాంగ్రెస్‌ను ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు: జగదీశ్ రెడ్డి

  • ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు రేవంత్‌ను చూసి భయపడే పరిస్థితి ఉందన్న మాజీ మంత్రి
  • రేవంత్ రెడ్డి చెడ్డపేరు తెచ్చుకొని చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నారని ఎద్దేవా
  • 25 సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి ఎవరి కాళ్లు మొక్కారని ప్రశ్న
కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసి ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... వికారాబాద్‌లో నిన్న అధికారులపై జరిగిన దాడితో రేవంత్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందన్నారు. కేసీఆర్‌ను నోటికి వచ్చినట్లు బూతులు తిట్టి సీఎం టైంపాస్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

సీఎం దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు కేసీఆర్‌ను మరిచిపోయారని చెబుతూనే... పదేపదే కేసీఆర్‌ను తలుచుకుంటూ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. చెడ్డపేరు తెచ్చుకొని చరిత్రలో నిలిచిపోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. నిన్నటి దాడి ఘటన వెనుక బీఆర్ఎస్ కుట్ర అని చెప్పడం విడ్డూరమని, మేధావులు వెళ్లి అసలు విషయం తెలుసుకోవాలన్నారు.

ఢిల్లీకి 25 సార్లు వెళ్లిన రేవంత్ రెడ్డి ఎవరి కాళ్లు మొక్కారో చెప్పాలని చురక అంటించారు. కేటీఆర్ ఎందుకు ఢిల్లీ వెళ్లారో మీ ఇంటెలిజెన్స్ ద్వారా కనుక్కోవచ్చని సూచించారు. కాంగ్రెస్, బీజేపీల బండారం బయటపెట్టేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని పేర్కొన్నారు. ఏ సమయంలో బయటకు రావాలో కేసీఆర్‌కు తెలుసని... ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ ఓ వ్యక్తి కాదని.. శక్తి అన్నారు.

ధాన్యం కొనుగోలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఓవైపు రివ్యూ చేస్తున్నట్లు నటిస్తూనే... మరోవైపు ప్లాన్ ప్రకారం మిల్లర్లను, దళారీలను రైతుల మీదకు వదిలారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. దీని వెనుక వందల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దళారులు, మిల్లర్లతో మంత్రులు కుమ్మక్కు అయ్యారన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం రైతులతో ఆడుకుంటోందన్నారు.

బీఆర్ఎస్ హయాంలో రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేశామన్నారు. రైతుల వద్ద ధాన్యం కొనకుండా అధికారులను నల్గొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి బెదిరిస్తున్నారని ఆరోపించారు. దళారులతో కుమ్మక్కు కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. రైతులు దోపిడీకి గురవుతున్నారని... దీనికి వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు గింజ ధాన్యం కొనుగోలు చేయలేదని... రైతులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పేందుకు అధికారులు భయపడుతున్నారన్నారు.


More Telugu News