సుప్రీంలో జగన్ అక్రమాస్తుల కేసు మరో ధర్మాసనానికి

  • ‘నాట్ బిఫోర్ మి’ చెప్పిన జస్టిస్ సంజయ్ కుమార్
  • విచారణను మరో ధర్మాసనానికి మార్చిన సీజేఐ
  • ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్లు రెండూ జస్టిస్ ఓకా బెంచ్ కు మార్పు
సుప్రీంకోర్టులో వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీజేఐ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసు విచారణను మరో ధర్మాసనానికి అప్పగించింది. ఇప్పటి వరకు ఈ కేసులో వాదనలు విన్న సీజేఐ బెంచ్.. తాజాగా మరో బెంచ్ ముందుకు పంపిస్తూ నిర్ణయం తీసుకుంది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే. ఈ బెయిల్ ను రద్దు చేయాలంటూ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు.

దీంతో పాటు ఈ కేసు విచారణను హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి మార్చాలంటూ రఘురామకృష్ణరాజు మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. కాగా, సీబీఐ, ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించినప్పటికీ సీబీఐ కేసుల్లో తీర్పు తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. దీనిపై సుప్రీంకోర్టులో ఈడీ పిటిషన్‌ దాఖలు చేసింది.

జగన్ అక్రమాస్తుల కేసు మంగళవారం విచారణకు రాగా.. సీజేఐ బెంచ్ లోని జస్టిస్ సంజయ్ కుమార్ ‘నాట్ బిఫోర్ మి’ చెప్పారు. దీంతో కేసును సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా మరో ధర్మాసనానికి మార్చారు. గత విచారణ సందర్భంగా జస్టిస్ సంజయ్ కుమార్ నాట్ బిఫోర్ మి చెప్పినా పొరపాటున మంగళవారం మళ్లీ లిస్ట్ అయినట్లు సీజేఐ తెలిపారు. ఈ కేసును జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం డిసెంబర్ 2వ తేదీన విచారిస్తుందని తెలిపారు. ఎంపీ రఘురామ దాఖలు చేసిన రెండు పిటిషన్లనూ జస్టిస్ ఓకా ధర్మాసనమే విచారిస్తుందని చెప్పారు.



More Telugu News