చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ కు రానన్న భారత్.. పాక్ సంచలన నిర్ణయం?

  • చాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలగాలని పాక్ నిర్ణయం
  • ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లోనూ భారత్‌తో తలపడకూడదన్న నిర్ణయానికి పాక్ 
  • పాక్‌లో పర్యటించకూడదన్న భారత్ నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న పాక్ ప్రభుత్వం
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీకి వెళ్లేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పడంతో పాకిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. భారత్-పాక్ దేశాల మధ్య రాజకీయ పరమైన ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో భారత జట్టు పాక్‌లో పర్యటించబోదని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇప్పటికే పీసీబీకి సమాచారమిచ్చింది. ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వానికి పీసీబీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో ‘డాన్’ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. చాంపియన్స్ ట్రోఫీని పాక్ ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. 

చాంపియన్స్ ట్రోఫీ విషయంలో హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించే ప్రసక్తే లేదని పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ ఇప్పటికే తెగేసి చెప్పారు. హైబ్రిడ్ మోడల్‌ను కనుక పీసీబీ అంగీకరించి ఉంటే చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్, పాక్ తలపడే మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించి ఉండేవారు. అయితే, ఇప్పుడు ఈ మోడల్‌ను అంగీకరించబోమని పాక్ స్పష్టంగా చెప్పడం, భారత జట్టు పాక్‌లో పర్యటించేందుకు ససేమిరా అనడంతో పాకిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకుంది.

చాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకోవాలంటూ పీసీబీని ఆదేశించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. అంతేకాదు, ఈ విషయంలో పాక్ ప్రభుత్వం ‘సీరియస్’గా ఉందని ‘డాన్’ తన కథనంలో పేర్కొంది. అంతేకాదు, ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య సమస్య పరిష్కారమయ్యే వరకు ఐసీసీ, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించే ఏ టోర్నీలోనూ భారత్‌తో పాక్ ఆడకూడదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. 

గతేడాది ఆసియాకప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చింది. అయితే భారత్, పాక్ తలపడే మ్యాచ్‌లు మాత్రం హైబ్రిడ్ మోడల్ ప్రకారం శ్రీలంకలో జరిగాయి. చాంపియన్స్ ట్రోఫీని కూడా అదే మోడల్‌లో నిర్వహించాలని యోచిస్తున్నా పాక్ అందుకు అంగీకరించడం లేదు. భారత్, పాక్ జట్ల మధ్య చివరిసారి 2012లో ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. పాక్ జట్టు 2016లో టీ20 ప్రపంచకప్ కోసం, గతేడాది వన్డే వరల్డ్ కప్ కోసం భారత్‌లో పర్యటించింది. 


More Telugu News