కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు

  • హత్యాచారం కేసు మొత్తం మాజీ పోలీసు కమీషనర్ వినీత్ గోయల్ కుట్రన్న సంజయ్ రాయ్
  • తనను ఇరికించారన్న నిందితుడు
  • విచారణలో భాగంగా కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో సంచలన ఆరోపణలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటన కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసు మొత్తం కోల్‌కతా మాజీ పోలీస్ కమీషనర్ వినీత్ గోయల్‌ కుట్ర అని ఆరోపించాడు. ఈ కేసులో తనను ఇరికించారని పేర్కొన్నాడు. సంజయ్ రాయ్‌ని సీల్దా కోర్టు నుంచి పోలీసు వ్యానులో తీసుకెళుతున్న సమయంలో అతడు ఈ  వ్యాఖ్యలు చేశాడు. ‘‘ ఈ కుట్ర (వైద్యురాలిపై అత్యాచారం, హత్య) అంతా వినీత్ గోయల్‌దే. నన్ను ఇరికించాడని నేను మీకు చెబుతున్నాను’’ అని సంజయ్ రాయ్ అన్నాడు. 

ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం అతడిని పోలీసులు సీల్డా కోర్టుకు తరలించారు. జిల్లా అడిషనల్, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ విచారణ జరిపారు. కేసుతో సంబంధం లేని వారిని అనుమతించకుండా, ఈ విచారణను కోర్టు గది తలుపులు మూసి ఉంచి నిర్వహించారు.

కాగా భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64 (రేప్), సెక్షన్ 66‌తో పాటు (మరణానికి కారణం) పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ అనే ప్రభుత్వ హాస్పిటల్‌లో రాత్రి డ్యూటీలో ఉన్న ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. నిందితుడు సంజయ్ రాయ్‌ని ఆగస్టు 10న పోలీసులు అరెస్టు చేశారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసు దర్యాప్తును చేపడుతోంది.


More Telugu News