వికారాబాద్ జిల్లా కలెక్టర్ కారుపై రాళ్లతో దాడి చేసిన రైతులు

  • పార్మా విలేజ్ కోసం భూములిచ్చే రైతులతో చర్చించేందుకు లగచర్లకు వచ్చిన కలెక్టర్
  • కలెక్టర్‌తో చర్చకు గ్రామం వెలుపల సభను ఏర్పాటు చేసిన అధికారులు
  • ఆ తర్వాత చర్చలకు గ్రామంలోకి వెళ్లిన కలెక్టర్
  • ఈ సమయంలో కలెక్టర్ వెనక్కి వెళ్లాలంటూ కారుపై రాళ్లతో దాడి
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కారుపై లగచర్ల గ్రామస్థులు రాళ్లు విసిరారు. ఫార్మా విలేజ్ కోసం భూములు ఇచ్చే రైతులతో చర్చించేందుకు స్థానిక తహసీల్దారుతో కలిసి కలెక్టర్ ఆ గ్రామానికి వచ్చారు. ఈ సమయంలో రైతులు వారి కారుపై రాళ్లతో దాడి చేశారు. ఫార్మా విలేజ్ భూసేకరణలో భాగంగా రైతులతో చర్చించేందుకు వారు వచ్చారు.

లగచర్ల గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో అధికారులు గ్రామసభను పెట్టారు. గ్రామసభ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఊరి బయట చర్చలకు ఏర్పాట్లు చేయడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కలెక్టర్‌తో చర్చకు గ్రామం వెలుపల ఏర్పాటు చేసిన గ్రామసభకు రైతులు గైర్హాజరయ్యారు.

గ్రామసభ వద్ద ఇద్దరు రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ గ్రామానికి వెళ్లారు. కలెక్టర్ గ్రామానికి రాగానే రైతులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ వెనక్కి వెళ్లాలని కారుపై రాళ్లు విసిరారు. దీంతో కారు అద్దాలు పగిలాయి.


More Telugu News