మోదీ ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. సిద్దరామయ్య సవాల్

  • మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సిద్దరామయ్య సర్కారుపై మోదీ తీవ్ర ఆరోపణలు
  • ఎక్సైజ్ శాఖలో రూ. 700 కోట్ల కుంభకోణం జరిగిందన్న ప్రధాని
  • ఆ సొమ్మును మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వాడుకుంటోందన్న మోదీ
  • ఆరోపణలు నిరూపించకుంటే మోదీ రాజకీయాల నుంచి తప్పుకోవాలని కర్ణాటక సీఎం డిమాండ్
కర్ణాటక ఎక్సైజ్ శాఖలో రూ. 700 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఆరోపించిన ప్రధాని నరేంద్రమోదీ.. ఆ ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ముఖ్యమంత్రి సిద్దరామయ్య సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే మోదీ రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. రెండ్రోజుల క్రితం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ కర్ణాటక ఎక్సైజ్ శాఖలో భారీ కుంభకోణం జరిగిందని, ఆ సొమ్మును మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ వాడుకుంటోందని ఆరోపించారు. 

కర్ణాటక వైన్ మర్చెంట్స్ అసోసియేషన్ ఇటీవల ఎక్సైజ్ విభాగంపై తీవ్ర ఆరోపణలు చేసింది. మరీ ముఖ్యంగా మంత్రి తిమ్మాపూర్‌ను లక్ష్యంగా చేసుకుంది. లైసెన్సులు మంజూరు చేసేందుకు, ట్రాన్స్‌ఫర్ల కోసం రూ. 30 లక్షల నుంచి రూ. 70 లక్షలు వసూలు చేస్తున్నట్టు ఆరోపించింది. గత ఏడాది కాలంలో ఇలా 1000 లైసెన్సులను అక్రమంగా కేటాయించారని, ఫలితంగా రూ. 300-700 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించింది. 

మోదీ ఆరోపణలను ఖండించిన సీఎం సిద్దరామయ్య నిధుల దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు. దేశానికి ప్రధాని అయి ఉండీ మోదీ ఇన్ని అబద్ధాలు ఆడతారని అనుకోలేదని, ఆయన ఆరోపణలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని పేర్కొన్నారు. మోదీ తన ఆరోపణలను నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి వైదొలగుతానని, లేదంటే ఆయన రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించాలని సవాలు విసిరారు. ప్రధాని చేసే ఆరోపణలు వాస్తవానికి కాస్తయినా దగ్గరగా ఉండాలని, కానీ మోదీ ఆరోపణలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఇంతగా అబద్ధాలు చెప్పే వ్యక్తిని ఇప్పటి వరకు చూడలేదని సిద్దరామయ్య ఎద్దేవా చేశారు. 


More Telugu News