రోహిత్, కోహ్లీ ఫామ్‌పై తొలిసారి స్పందించిన హెడ్ కోచ్ గంభీర్.. విమర్శకులకు గట్టి కౌంటర్లు

  • స్టార్ ఆటగాళ్ల ఫామ్‌పై ఎలాంటి ఆందోళన లేదన్న గౌతమ్ గంభీర్
  • వీరిద్దరిపై క్రికెట్ నిపుణులు చేస్తున్న వ్యాఖ్యానాలను పట్టించుకోబోనని స్పష్టీకరణ 
  • రికీ పాంటింగ్‌కు భారత క్రికెట్‌తో సంబంధమేంటని కౌంటర్ ఇచ్చిన భారత కోచ్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు రెండవ బృందం ఇవాళ (సోమవారం) ఆస్ట్రేలియా బయలుదేరనున్న నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడాడు. భారత జట్టుకు సంబంధించి మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్‌పై వ్యక్తమవుతున్న విమర్శలు, ఆందోళనలను కొట్టిపారేశాడు. ఈ స్టార్ ఆటగాళ్లపై క్రికెట్ నిపుణులు చేస్తున్న వ్యాఖ్యానాలను తాను పట్టించుకోబోనని క్లారిటీ ఇచ్చాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్‌లో ఉన్నాడంటూ ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలకు గంభీర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.

రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచించాలని, భారత క్రికెట్ గురించి కాదని గంభీర్ వ్యాఖ్యానించాడు. ‘‘భారత క్రికెట్‌తో పాంటింగ్‌కు సంబంధం ఏంటి? ఆయన ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచించాలి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై నాకు ఎలాంటి ఆందోళనా లేదు’’ అని గంభీర్ స్పష్టం చేశాడు.

తొలి టెస్టుకు రోహిత్ దూరం
పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ ఆడడం లేదని, ఈ మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని గంభీర్ తెలిపాడు. రోహిత్, విరాట్‌లకు ఉద్వాసన పలకాలని చూస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కదా అని మీడియా ప్రశ్నించగా.. జట్టు రూపాంతరంపై ఎలాంటి ఆలోచనలు చేయడం లేదని, ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లే గొప్ప విజయాలు సాధించబోతున్నారని విశ్వాసం వ్యక్తం చేశాడు. వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకోవడంపై మాట్లాడుతూ.. తదుపరి తరం ఆటగాళ్లు జట్టులో అడుగుపెడుతున్నారని వ్యాఖ్యానించాడు.

ఇక ఆస్ట్రేలియాలో పిచ్‌‌లు ఎలా ఉంటాయో చెప్పలేమని, వాటిని మనం నియంత్రించలేమని గంభీర్ అన్నాడు. అయితే ఆస్ట్రేలియాలో రాణించేందుకు ప్రాక్టీస్ చాలా ముఖ్యమని చెప్పాడు. రానున్న 10 రోజులు ఆస్ట్రేలియాలో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదని పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్ ఫామ్‌పై స్పందిస్తూ.. అతడి లాంటి ఆటగాళ్లు ఏ దేశానికి ఉన్నారని గంభీర్ ప్రశ్నించాడు. ఓపెనర్‌గా వస్తాడు, కావాలనుకుంటే 6వ స్థానంలో కూడా బ్యాటింగ్ చేస్తాడని సమర్థించాడు.

కాగా భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య నవంబర్ 22 నుంచి 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ మొదలుకానుంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ సిరీస్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పలువురు ఆటగాళ్లు  నిన్నే (ఆదివారం) ఆస్ట్రేలియా బయలుదేరారు. మిగతా ఆటగాళ్ల బృందం, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇవాళ బయలుదేరనున్నారు. ప్రయాణానికి ముందు గంభీర్ మీడియాతో మాట్లాడాడు.


More Telugu News