మహేశ్ బాబు-రాజమౌళి సినిమాపై తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్రస్టింగ్ కామెంట్స్

  • ‘ఎస్ఎస్ఎంబీ 29’ సినిమా బడ్జెట్ రూ.1000 కోట్లు దాటవచ్చన్న దర్శక నిర్మాత
  • సినిమా వసూళ్లు రూ.2000 కోట్లు దాటతాయని అంచనా
  • భారతదేశ సినీరంగంలోనే ఈ సినిమా చరిత్ర అవుతుందని వ్యాఖ్య
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా ‘ఎస్ఎస్ఎంబీ 29’ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టుపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్ట్‌ తర్వాత ప్రపంచమంతా తెలుగు సినిమా గురించే మాట్లాడుకుంటుందని, తెలుగు సినిమా ఎవరూ ఊహించని స్థాయికి ఎదుగుతుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ బడ్జెట్‌ కచ్చితంగా రూ.1000 కోట్లు దాటవచ్చని భరద్వాజ అంచనా వేశారు. బాహుబలి సినిమా విడుదలయ్యాక తెలుగు సినిమా స్థాయి పెరిగిందని, రూ.100 కోట్ల సినిమా అంటే సాధారణ అంశంలా మారిపోయిందని అన్నారు. ఇక ఎన్టీఆర్-రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఆర్‌ఆర్ఆర్‌ తర్వాత రూ.300 కోట్లు చిన్న బడ్జెట్‌గా కనిపిస్తోందని, ప్రస్తుతం మహేశ్‌ సినిమా వచ్చాక రూ.500 కోట్లు సాధారణ విషయంలా అనిపిస్తోందని చెప్పారు.

వసూళ్లు రూ.3-4 వేల కోట్లు ఉండొచ్చు
ఈ సినిమా కనీసం రూ.2 వేల కోట్ల బిజినెస్ జరుపుతుందని తమ్మారెడ్డి భరద్వాజ అంచనా వేశారు. వసూళ్లు రూ.3-4 వేల కోట్ల వరకు రావొచ్చని అన్నారు. ఈ సినిమాలో అంతర్జాతీయ స్థాయి నటులు నటిస్తారని పేర్కొన్నారు. భవిష్యత్తును రాజమౌళి చాలా బాగా ఊహిస్తారని, ‘ఎస్ఎస్ఎంబ29’ ద్వారా మరోసారి ఆయన సత్తా చాటనున్నారని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ బిజినెస్‌ ఊహించడం కూడా కష్టమని, రూ.3-4 వేల కోట్ల వసూలు చేస్తే భారతదేశ సినీరంగంలోనే చరిత్ర అవుతుందని భరద్వాజ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘ఎస్ఎస్ఎంబీ29’ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ మరింత ఎత్తుకు ఎదగాలని తాను కోరుకుంటున్నానని ఆయన అభిలషించారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కాగా ‘ఎస్ఎస్ఎంబీ29’ ప్రాజెక్ట్ లొకేషన్ల కోసం దర్శకుడు రాజమౌళి అన్వేషిస్తున్న విషయం తెలిసిందే.


More Telugu News