తెలుగు జాతిపై నోరు పారేసుకున్న సినీనటి కస్తూరి కోసం పోలీసుల గాలింపు

  • అంతఃపుర స్త్రీలకు సేవ చేసేందుకు వచ్చినవారే తెలుగువారన్న కస్తూరి
  • తెలుగు సంఘాల ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు
  • ఇంటికి తాళం వేసి.. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్న నటి
  • గాలింపు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన పోలీసులు
రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగు వారంటూ నోరు పారేసుకున్న సినీనటి, బీజేపీ నాయకురాలు కస్తూరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆమె కోసం ప్రత్యేక బృందాన్ని పోలీసులు రంగంలోకి దింపారు. హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో చెన్నైలో ఇటీవల నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న కస్తూరి మాట్లాడుతూ తెలుగు జాతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే, మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ద్రవిడ సిద్ధాంత వాదులను ఆమె పరోక్షంగా ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన తెలుగు సంఘాలు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నై ఎగ్మోర్‌లో ఉన్న తెలుగు సంస్థ ఫిర్యాదు మేరకు కస్తూరిపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసులో కస్తూరికి సమన్లు ఇచ్చేందుకు వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉండడంతో ఆమెకు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉండడంతో ఆమె పరారీలో ఉన్నట్టు గుర్తించారు. దీంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.


More Telugu News