ఎయిర్‌పోర్టుల్లో ధరలు చూసి ఫుడ్ కొనలేకపోతున్న ప్రయాణీకులకు గుడ్‌న్యూస్ !

  • విమానాశ్రయాల్లో ఎకానమీ జోన్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన పౌరవిమానయాన శాఖ
  • పలు దఫాల చర్చల అనంతరం ఏకాభిప్రాయం సాధించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
  • ఎకానమీ జోన్‌ లలో తక్కువ ధరకే ప్యాసింజర్లు ఆకలి తీర్చుకునే అవకాశం 
  • సరసమైన ధరలకే లభ్యం కానున్న ఆహార పదార్థాలు, పానీయాలు
విమానాశ్రయాల్లో భోజనం చేయడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సాధారణ వ్యక్తులైతే ధరలు చూసి కడుపు మాడ్చుకుంటారు కానీ కొనడానికి మొగ్గుచూపరు. ఆహార పదార్థాల ధరలు చాలా ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. 

అయితే సామాన్యుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సరసమైన ధరలకే ఆహారం, పానీయాలను విక్రయించేందుకుగానూ ‘ఎకానమీ జోన్‌’లను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎకానమీ జోన్‌లు ఆచరణలోకి వస్తే ఎయిర్‌పోర్టుల్లో సామాన్య ప్రయాణికులు కూడా ఆకలి తీర్చుకోవచ్చు.

అయితే ఎయిర్‌పోర్టులో ఇతర రెస్టారెంట్ల మాదిరిగా కాకుండా, ఈ ఎకానమీ జోన్‌లలో... కూర్చొని తినే ఏర్పాట్లు ఉండవని అధికారులు చెబుతున్నారు. ప్రయాణీకులు ఫాస్ట్ ఫుడ్ టేబుల్స్ వద్ద తినాల్సి ఉంటుంది, లేదంటే ఆహారాన్ని తమ వెంట తీసుకెళ్లే సౌలభ్యం ఉంటుంది. ఎకానమీ జోన్ల ప్రారంభం అంశంపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పలు దఫాలు చర్చించి ఏకాభిప్రాయం సాధించారని అధికారులు చెబుతున్నారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా (ఏఏఐ), ఎయిర్‌పోర్ట్‌లలోని ఫుడ్ అవుట్‌లెట్‌లతో పాటు ఇతర ఏజెన్సీలు ఎకానమీ జోన్లను నిర్వహించనున్నాయని తెలిపారు.

కాగా ఈ తరహా జోన్‌లు తొలుత కొత్తగా నిర్మించిన విమానాశ్రయాల్లో అందుబాటులోకి వస్తాయని పౌరవిమానయాన శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుంచితే విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల ధరలు అధికంగా ఉన్నాయని ఫిర్యాదులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కూడా సోషల్ మీడియా ఒక పోస్ట్ పెట్టారు. కోల్‌కతా విమానాశ్రయంలోని ఓ ఫేమస్ దుకాణంలో ఒక కప్పు టీ రూ.340 ఖర్చవుతోందని వాపోయారు.


More Telugu News