కెనడా బోర్డర్ లో అలర్ట్... అమెరికా నుంచి అక్రమ వలసలు!

  • ట్రంప్ గెలుపొందడంతో వలసలు పెరుగుతాయని తెలుసన్న కెనడా సర్కారు
  • సరిహద్దుల్లో నిఘా పటిష్ఠం చేశామని ప్రభుత్వం వెల్లడి
  • కెనడా వెళ్లడం ఎలా? అంటూ గూగుల్ సెర్చ్ లో పెరుగుతున్న ఎంక్వైరీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రంప్ గెలవడంతో అమెరికన్లు చాలామంది కెనడా వెళ్లిపోయే ప్లాన్ లో ఉన్నారట. అమెరికాలో ట్రంప్ గెలుపు తమ దేశంలోకి వలసలను పెంచుతుందని కెనడా అధికార వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఎన్నికల ఫలితాల రోజు నుంచే సరిహద్దుల్లో భద్రత పటిష్టం చేశామని వివరించారు. బోర్డర్ లో సైనికులు, అధికారులు అందరూ అప్రమత్తంగా ఉన్నారని వివరించారు. కెనడా, అమెరికా సరిహద్దును నిశితంగా పరిశీలిస్తున్నామని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ప్రతినిధి, సార్జెంట్ చార్లెస్ పోయియర్ చెప్పారు. 

గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనూ అమెరికా నుంచి కెనడాలోకి భారీగా వలసలు చోటుచేసుకున్నాయని కెనడా అధికారులు చెప్పారు. తాజాగా ట్రంప్ మరోసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టనుండడంతో మరోసారి వలసలు పెరగనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గూగుల్ లో కెనడా ఇమ్మిగ్రేషన్, కెనడాలోకి ఎలా వెళ్లాలి, అనధికారికంగా వెళ్లడానికి మంచి లొకేషన్ ఏది...? అంటూ... ఆయా వివరాలకు సంబంధించి ఆరా తీస్తున్న వారి సంఖ్య దాదాపు పదిరెట్లు పెరిగిందన్నారు. అయితే, బోర్డర్ దాటి తమ దేశంలోకి అడుగుపెట్టడం అంత సులభం కాదని ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది దృష్టి మొత్తం బోర్డర్ పైనే ఉందని చెప్పారు. సరిహద్దులో కెమెరాలు, సెన్సర్లు, డ్రోన్లను మోహరించామని చెప్పారు. చొరబాట్లను అడ్డుకోవడంతో పాటు దేశంలోని వలసదారుల సంఖ్యను కూడా తగ్గించాలని ట్రూడో సర్కారు నిర్ణయించింది. 

2024లో 4.85 లక్షల మందిని కెనడా శాశ్వత నివాసులుగా గుర్తించింది. వచ్చే ఏడాది ఈ సంఖ్యను 3.80 లక్షలకు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2027 నాటికి దేశంలోకి 3.65 లక్షల మంది వలసదారులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


More Telugu News