పోలీసులపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

  • గత సెప్టెంబరులో కాకినాడలో ఇద్దరు విద్యార్థుల మృతి
  • మృతుల కుటుంబసభ్యులను పరామర్శించిన పవన్
  • రోడ్డు ప్రమాదాల వేళ పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని హితవు
  • పోలీసుల తరఫున మృతుల కుటుంబాలకు క్షమాపణ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల తరచుగా పోలీసులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా, మరోసారి పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత సెప్టెంబరులో కాకినాడలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా... పవన్ నేడు వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. 

ఈ సందర్భంగా పవన్ స్పందిస్తూ, రోడ్డు ప్రమాదాల వేళ పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. కాకినాడ జిల్లాలో ఇద్దరు విద్యార్థుల మృతి ఘటనలో పోలీసుల తీరు బాధ కలిగించిందని అన్నారు. మృతుల కుటుంబాలకు పోలీసుల తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానని వెల్లడించారు. 

అంతటి బాధలో కూడా విద్యార్థి రేవంత్ అవయవదానం చేసేందుకు ముందుకొచ్చిన తల్లిదండ్రుల మానవత్వం కదిలించిందని అన్నారు. బాధిత కుటుంబాలకు సొంతంగా రూ.2 లక్షల చొప్పున సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు.

పోలీసులు బాధ్యతగా పనిచేయకపోతే, వారు చేసిన తప్పులు కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తాయని అన్నారు. రోడ్డు ప్రమాదాలలో కేసుల భయం కాకుండా, తక్షణ సాయం అవసరమని తెలిపారు. ఈ విషయంలో అవగాహన కల్పించే దిశగా పోలీసులు పనిచేయాలని సూచించారు.


More Telugu News