ఆకలిబాధ ఎలా ఉంటుందనేది తెలుసు: సింగర్ శిరీష!

  • తెలంగాణ జానపద గాయనిగా శిరీష
  • పాటలంటే చిన్నప్పటి నుంచి ఇష్టమని వెల్లడి 
  • ఆర్ధికంగా ఇబ్బందులు పడ్డామని వివరణ
  • తమ కోసం తండ్రి పస్తులున్నాడని వ్యాఖ్య

తెలంగాణ యాసలో పాటలు పాడటంలో మంచి నైపుణ్యం సాధించినవారిలో శిరీష ఒకరు. ఆమె పాడిన పాటలు చాలా పాప్యులర్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో ఆమె పాడిన 'గున్నా గున్నా మావిళ్లల్ల' అనే పాట జనంలోకి బాగా దూసుకుపోయింది. తాజాగా ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించింది. 

"నేను పుట్టి పెరిగింది 'సిరిసిల్ల'లో.  చిన్నప్పటి నుంచి నాకు పాటలు పాడటం ఇష్టం. 5వ తరగతి నుంచి నేను ఎక్కడ పాడితే అక్కడ ప్రైజ్ వచ్చేది. ఆటలు కూడా బాగా ఆడేదానిని. అలాగే చదువులో కూడా ముందు ఉండేదానిని. అయితే ఒక అమ్మాయి చేసిన పని కారణంగా నేను స్కూల్ కి వెళ్లడం మానేయవలసి వచ్చింది. ఆ సమయంలో అమ్మా నాన్నలకు నేత పనిలో సాయం చేస్తూ ఇంటి దగ్గరే ఉన్నాను" అని అంది. 

"నేను చదువు ఆపేయడానికి మరో కారణం కూడా ఉంది. అప్పట్లో మా ఆర్ధిక పరిస్థితి బాగుండేది కాదు. ఒక్కోపూట తినడానికి కూడా ఉండేది కాదు. మా నాన్న పస్తులు ఉండి మాకు పెట్టేవాడు. అలాంటి పరిస్థితుల్లో నేను మిషన్ కుట్టాను... బీడీలు చుట్టాను. అలాంటి నాకు పాటలు పాడటంలో మంచి గుర్తింపు వచ్చింది. నిజంగా అది నా అదృష్టమే" అని చెప్పింది.



More Telugu News