సిగరెట్లు మానేయడానికి తలను పంజరంలో బంధించుకున్న వ్యక్తి

  • ధూమపానానికి దూరమయ్యేందుకు కఠిన పద్దతి అనుసరిస్తున్న తుర్కియే వ్యక్తి
  • తలను ఉదయాన్నే పంజరంలో పెట్టి తాళం వేసుకున్న వైనం
  • ఆరోగ్యం పాడవ్వడంతో తనకు తానే లాక్‌డౌన్ విధించుకున్న వ్యక్తి
ఒక్కసారి ధూమపానానికి అలవాటైతే మానుకోవడం అంత తేలిక కాదు. అందుకే చాలా మంది ఆరోగ్యాలు పాడవుతున్నా ఈ అలవాటును వదులుకోలేకపోతుంటారు. అయితే ఎలాగైనా ధూమపానానికి దూరం కావాలని ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తి తన తలను ఒక పంజరంలో బంధించుకున్నాడు. సిగరెట్ తాగడానికి ఎలాంటి అవకాశం లేకుండా ఈ పద్దతిని ఎంచుకున్నాడు. 

తుర్కియేకి చెందిన ఇబ్రహీం యూసెల్ అనే వ్యక్తి తనకు తానే లాక్‌డౌన్ విధించుకున్నాడు. సిగరెట్లు మానుకోవాలనే లక్ష్యంతో ఒక పంజరాన్ని రూపొందించుకున్నాడు. ప్రతి రోజూ ఉదయం తన తలను అందులో పెట్టి లాక్ చేసుకుంటున్నాడు. లాక్ చేసిన వెంటనే తాళపు చెవిని కుటుంబ సభ్యులకు ఇస్తున్నాడు.

ఇబ్రహీం గత 26 సంవత్సరాలకు పైగా రోజుకు రెండు ప్యాక్‌ల సిగరెట్లు కాల్చాడు. ఆరోగ్యం దెబ్బతినడంతో ఎలాగైనా ఈ అలవాటును మానుకునేందుకు ఈ కఠిన పద్దతిని అనుసరిస్తున్నాడు. గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వ్యసనం నుంచి బయటపడలేకపోయాడు. అందుకే ఈసారి ఏదైతే అదైందనే సంకల్పంతో తలను పంజరంలో బంధించుకున్నాడు.

హెల్మెట్ ప్రేరణతో అదే ఆకృతిలో, దాదాపు అదే పరిమాణంలో తనకు తానే ఈ పంజరాన్ని తయారుచేసుకున్నాడు. 40 మీటర్ల రాగి తీగ తెచ్చుకొని ఇంట్లోనే సొంతంగా రూపొందించాడు. సిగరెట్‌ తాగడానికి ఏమాత్రం అవకాశం లేదని నిర్ధారించుకున్న తర్వాత దీనిని ఉపయోగించాడు. ఉదయాన్నే తలను లాక్ చేసుకొని తాళపు చెవిని భార్య లేదా కూతురికి అందజేసేవాడు. పంజరంలో బిగించిన తలతో కొన్నిసార్లు వీధుల్లో కూడా కనిపించేవాడు. తలను బంధించుకోవడం మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉందని, అయితే ఆరోగ్యం కోసం తన భర్త చాలా కష్టపడుతున్నారని అతడి భార్య చెప్పింది. కాగా ఇబ్రహీంకి తినడం కష్టంగా మారేది. స్ట్రా ద్వారా నీటిని పీల్చేవాడు. తాళం వేసి ఉన్న సమయంలో బిస్కెట్స్ మాత్రమే తినేవాడు. అయితే ఇబ్రహీం ఇదంతా కొన్నేళ్ల కిందట చేశాడు. ఆయనకు సంబంధించిన ఫొటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


More Telugu News