అమరావతిలో సీప్లేన్ డెమో మనందరికీ గర్వకారణం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

  • దేశంలో సీప్లేన్ రంగానికి చాలా పొటెన్షియల్ ఉందన్న మంత్రి
  • చంద్రబాబు ఆశీర్వాదంతో సీప్లేన్ రీలాంచ్ జరుగుతోందని వ్యాఖ్య
  • డ్రోన్ల నుంచి సీప్లేన్ దాకా ఎన్నో అద్భుత కార్యక్రమాలకు వేదికగా పున్నమి ఘాట్ 
దేశంలో సీప్లేన్ రీలాంచ్ కు అమరావతి వేదిక కావడం మనందరికీ గర్వకారణమని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. గుజరాత్ లో జరిగిన తొలి ప్రయత్నంలో పలు ఆటంకాలు ఎదురవడంతో ఈ ప్రాజెక్ట్ కొంత వెనుకబడిందని చెప్పారు. వాటర్ ఎయిరోడ్రోమ్ ల విషయంలో ఎదురైన సమస్యలను పరిష్కరించి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సలహాలు, సూచనలతో ప్రస్తుతం సీప్లేన్ డెమోను రీలాంచ్ చేస్తున్నట్లు వివరించారు. ఈమేరకు విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీప్లేన్ డెమో కార్యక్రమానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... చంద్రబాబు ఆశీస్సులతో తాను కేంద్ర మంత్రి కావడం, సివిల్ ఏవియేషన్ శాఖ బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ రంగంలోని అవకాశాలన్నింటినీ ఉపయోగించి భారతదేశాన్ని సివిల్ ఏవియేషన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని చంద్రబాబు తనకు సూచించారన్నారు. ఆయన సూచనలతో ఛాలెంజింగ్ గా పనిచేయాలని తన శాయశక్తులా కృషిచేస్తున్నట్లు వివరించారు. 

సివిల్ ఏవియేషన్ అంటే కేవలం ఎయిర్ పోర్టులు, ఎయిర్ ప్లేన్స్ మాత్రమే కాదని మంత్రి గుర్తుచేశారు. ఎయిర్ పోర్టులు లేనిచోట కొత్త వాటిని నిర్మించడం కొంత కష్టమైన పని అని, దీనికి అవసరమైన భూసేకరణ కష్టంగా మారిందని చెప్పారు.

ఈ క్రమంలోనే సీప్లేన్ ద్వారా ప్రయాణికులను చేరవేసే ప్రత్యామ్నాయం ఆలోచించినట్లు తెలిపారు. మన దేశంలోని ఓ చిన్న జిల్లా పరిమాణంలో ఉండే మాల్దీవులలో వందలాది సీప్లేన్ లు నిత్యం ఎగురుతున్నాయని చెప్పారు. మాల్దీవులతో పోలిస్తే భారతదేశంలో సీప్లేన్లకు ఎంతో పొటెన్షియల్ ఉందని వివరించారు. 

ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు సూచనలతో సీప్లేన్ లాంచింగ్ లో ఎదురవుతున్న సమస్యలపై నిపుణులతో చర్చించామన్నారు. అవరోధాలను అధిగమించి, నిపుణుల మార్గదర్శకాలతో ఈ రోజు అమరావతిలో సీప్లేన్ డెమో లాంచ్ చేస్తున్నామని మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎక్కడెక్కడి నుంచో ఈ కార్యక్రమానికి వచ్చారని, వారందరికీ ధన్యవాదాలు అని మంత్రి చెప్పారు.

చంద్రబాబుపై పొగడ్తల వర్షం
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన ప్రసంగంలో ఏపీ సీఎం చంద్రబాబుపై పొగడ్తల జుల్లు కురిపించారు. ఆకాశంలో చంద్రుడు ఉంటే భూమికి పున్నమి వెలుగు అని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు వల్ల వెలుగు అని అన్నారు. చంద్రబాబు తన ఆలోచనలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసే గొప్ప నాయకుడని, ఆయన శిష్యుడ్ని కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. 

చంద్రబాబుతో కలిసి పనిచేయడమంటే జెట్ స్పీడ్ తో ముందుకు వెళ్లడమేనని, ఆయనను అందుకోవడం అంత తేలిక కాదని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సీప్లేన్ డెమో లాంచింగ్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని ఇంత చక్కగా నిర్వహించడం సంతోషకరమని రామ్మోహన్ నాయుడు చెప్పారు.


More Telugu News