విడాకుల సెటిల్‌మెంట్.. నగదు రూపంలో రూ. 12,068 కోట్లు ఇవ్వాలని భార్య డిమాండ్!

  • దక్షిణ కొరియా బిలియనీర్‌ చే టే-వొన్‌పై భార్య దావా
  • వన్ టైం సెటిల్‌మెంట్ కింద రూ. 12 కోట్లు చెల్లించిన చే
  • భర్త కంపెనీ షేర్లను కూడా కేటాయించాలని డిమాండ్
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన చే.. రివ్యూకు అంగీకారం
ఇది అత్యంత ఖరీదైన విడాకుల వ్యవహారం. విడాకుల సెటిల్‌మెంట్‌లో భాగంగా భార్యకు రూ. 1.38 ట్రిలియన్ వొన్ లు (దాదాపు రూ. 8,328 కోట్లు) చెల్లించాలంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై దక్షిణ కొరియాకు చెందిన బిలియనీర్, ఎస్‌కే గ్రూప్ చైర్మన్ చే టే-వొన్ ఆ దేశ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సమీక్షించేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. 

మరో మహిళతో తాను ఓ బిడ్డకు జన్మనిచ్చినట్టు 2015లో చే వెల్లడించారు. ఇది భార్య రోహ్ సోహ్-యోంగ్‌తో విభేదాలకు కారణమైంది. తనకు విడాకులు కావాలంటూ 2017లో ఆమె కోర్టుకెక్కింది. చే నికర ఆస్తి దాదాపు బిలియన్ డాలర్లు (రూ. 8,438 కోట్లు). సియోల్ హైకోర్టు ఆదేశాలతో వన్ టైం సెటిల్‌మెంట్ కింద చే గతంలో భార్య రోహ్ సోహ్-యోంగ్‌కు బిలియన్ వొన్ లు (రూ. 12 కోట్లు) చెల్లించారు. 

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు రోహ్ టే-వూ కుమార్తే రోహ్ సోహ్-యోంగ్. దాదాపు ట్రిలియన్ వొన్ ల (రూ. 6 కోట్లు) విలువ కలిగిన చే ఎస్‌కే ఇంక్ షేర్లలో 42.3 శాతం, అదనంగా 300 మిలియన్ వొన్ ల (రూ. 1.8 కోట్లు) భరణంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆ తర్వాత దానిని 2 ట్రిలియన్ వొన్ లు (రూ. 12,068 కోట్లు) నగదు రూపంలో, 3 బిలియన్ వొన్ లు (రూ. 18 కోట్లు) భరణం కింద ఇవ్వాలని సర్దుబాటు చేసింది. 

భార్య తన ఆస్తులను తప్పుగా లెక్కకట్టిందని, దక్షిణ కొరియా చట్టాల ప్రకారం వారసత్వంగా వచ్చిన ఆస్తులను విడాకుల పరిష్కారాల నుంచి మినహాయిస్తారని చే టే-వొన్ వాదించారు. అయితే, మునుపటి కోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఎస్‌కే గ్రూప్ విలువను పెంచడంలో రోహ్ కీలక పాత్ర పోషించారని, కాబట్టి సెటిల్‌మెంట్‌లో భాగంగా ఎస్‌కే షేర్లను కేటాయించాలన్న నిర్ణయాన్ని సమర్థించింది. 


More Telugu News