ఓ జంట జీవితాన్ని విడగొట్టి.. రైల్వేకు రూ. 3 కోట్ల నష్టం తెచ్చిపెట్టిన రెండక్షరాల ‘ఓకే’

  • వైజాగ్ స్టేషన్ మాస్టర్ జీవితంలో విషాదం నింపిన ‘ఓకే’
  • భార్యతో మాట్లాడుతూ ‘ఓకే’ చెప్పినందుకు ఉద్యోగం
  • భార్యతో 12 ఏళ్లపాటు కొనసాగిన వివాదానికి తాజాగా ఫుల్‌స్టాప్
  • విడాకులు మంజూరు చేసిన చత్తీస్‌గఢ్ హైకోర్టు
‘ఓకే’.. ఈ రెండక్షరాల పదం ఉద్యోగాన్ని ఊడబీకి, ఓ దాంపత్య జీవితంలో నిప్పులు పోసి పుష్కరకాలం పాటు అల్లకల్లోలం సృష్టించింది. అంత పెద్ద విపత్తుకు కారణమైన ఈ ఘటన గురించి తెలుసుకోవాలంటే పుష్కరకాలం వెనక్కి వెళ్లాలి. అతనో రైల్వే ఉద్యోగి. విశాఖపట్టణంలో రైల్వే స్టేషన్ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. 12 అక్టోబర్ 2011లో చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌కు చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. 

కొన్నాళ్లపాటు వారి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఆ తర్వాత కలతలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆయన విధుల్లో ఉన్న సమయంలో భార్య ఫోన్ చేసింది. ఇద్దరి మధ్య కాసేపు వాదులాట జరిగింది. దీంతో ఆయన ‘ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం.. ఓకే’ అని ఫోన్ పెట్టేశాడు. అప్పుడాయనకు తెలియదు.. ఆ ‘ఓకే’ అన్న పదం తన జీవితాన్ని అతలాకుతలం చేస్తుందని. 

మరోవైపు అదే సమయంలో పక్క స్టేషన్‌లో రేడియో ట్రాన్స్‌మిషన్ (వైర్‌లెస్ సెట్) పట్టుకుని ఉన్న స్టేషన్ మాస్టర్‌కు వైజాగ్ స్టేషన్ మాస్టర్‌ చెప్పిన ‘ఓకే’ అన్న పదం వినిపించింది. దీనిని ఆయన తప్పుగా అర్థం చేసుకున్నాడు. గూడ్సు రైలును పంపించేందుకు ఆయన ఓకే చెప్పినట్టుగా భావించి దానికి సిగ్నల్ ఇచ్చేశాడు. దీంతో రైలు మావోయిస్టు ప్రభావిత నిషిద్ధ ప్రాంతం గుండా బయలుదేరింది. రాత్రి పరిమితులను ఉల్లంఘించి అనధికారిక మార్గం గుండా రైలు ప్రయాణించడంతో రైల్వే సంస్థకు మూడు కోట్ల రూపాయల జరిమానా విధించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ‘ఓకే’ చెప్పిన స్టేషన్ మాస్టర్‌ను సస్పెండ్ చేశారు.

తన ఉద్యోగం పోవడానికి భార్యే కారణమని భావించిన స్టేషన్ మాస్టర్ విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ఆయన భార్య కూడా భర్త, అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది. వారందరూ కలిసి తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, హింసిస్తున్నారని ఆరోపించింది. ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. దీనిని విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ కేసును దుర్గ్ కుటుంబ న్యాయస్థానానికి బదిలీ చేసింది. విచారించిన కోర్టు స్టేషన్ మాస్టర్ విడాకుల పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఆయన చత్తీస్‌గఢ్ హైకోర్టును ఆశ్రయించారు. 

12 ఏళ్లపాటు కొనసాగిన ఈ కేసులో తాజాగా తుది తీర్పు వచ్చింది. చత్తీస్‌గఢ్ హైకోర్టు స్టేషన్ మాస్టర్‌కు అనుకూలంగా తీర్పునిస్తూ విడాకులు మంజూరు చేసింది. వివాహమైన తర్వాత కూడా ఆమె తన ప్రియుడితో సంబంధం కొనసాగిస్తూ వస్తోందని న్యాయస్థానం గుర్తించింది. దానిని కప్పిపుచ్చుకోవడంలో భాగంగానే భర్త, ఆమె కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్టు నిర్ధారించింది. తన ప్రవర్తనతో భర్తను మానసికంగా హింసించిందని పేర్కొంది. అంతేకాదు, రైలు ఘటనకు బాధ్యత ఆమెదేనని స్పష్టం చేస్తూ విడాకులు మంజూరు చేసింది. దీంతో పుష్కరకాలం పాటు కొనసాగిన వివాదానికి తెరపడింది.


More Telugu News