టీమిండియాలో విభేదాలు!.. కివీస్ చేతిలో ఘోర ఓటమి తర్వాత వెలుగులోకి!

  • కోచ్ గంభీర్‌తో కెప్టెన్ రోహిత్‌, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌లకు కుదరని ఏకాభిప్రాయం
  • ఆస్ట్రేలియా సిరీస్‌కు నితీష్ రెడ్డి, హర్షిత్ రాణాను ఎంపిక చేయడంపై విభేదాలు
  • కివీస్ చేతిలో 0-3 తేడాతో ఘోర ఓటమిపై బీసీసీఐ కార్యదర్శి జైషా, అధ్యక్షుడు రోజర్ బిన్నీ నేతృత్వంలో సుధీర్ఘ సమీక్ష
భారత క్రికెట్ జట్టులో విభేదాలు నెలకొన్నట్టు తెలుస్తోంది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 0-3 తేడాతో ఓటమి పాలవ్వడంపై బీసీసీఐ శుక్రవారం నిర్వహించిన సుదీర్ఘ సమీక్షలో ఈ విషయం బయటపడినట్టు సమాచారం. బీసీసీఐ కార్యదర్శి జై షా, అధ్యక్షుడు రోజర్ బిన్నీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ పాల్గొన్నారు. అయితే కెప్టెన్, కోచ్, చీఫ్ సెలక్టర్ మధ్య ఏకాభిప్రాయం లేదని తెలుస్తోంది. గంభీర్‌ నిర్ణయాల పట్ల రోహిత్, అజిత్ అగార్కర్ విభేదిస్తున్నట్టుగా ఈ సమీక్షలో బయటపడింది.

దాదాపు 6 గంటలపాటు కొనసాగిన ఈ సమీక్షలో అనేక అంశాలపై చర్చించగా.. జట్టుకు సంబంధించిన కొన్ని నిర్ణయాల విషయంలో గంభీర్‌తో రోహిత్, ఇతర అనుభవజ్ఞులు భిన్నాభిప్రాయాలతో ఉన్నట్టు బయటపడిందని పీటీఐ పేర్కొంది. ‘‘గంభీర్ కోచింగ్ శైలిని ప్రశ్నించారా? లేదా? అనేది నిర్ధారణ కాలేదు. కానీ భారత జట్టులోని కొంతమంది అనుభవజ్ఞులు చీఫ్ కోచ్‌తో విభేదించారని అర్థమైంది. రంజీ ట్రోఫీలో కేవలం 10 మ్యాచ్‌ల అనుభవం మాత్రమే ఉన్న టీ20 స్పెషలిస్ట్ ఆల్ రౌండర్ నితీష్ రెడ్డి, పేసర్ హర్షిత్ రాణాలను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయడం విభేదాలకు కారణంగా ఉంది. వీరిద్దరి ఎంపికకు ఏకగ్రీవ మద్దతు లభించలేదు. వారికి పెద్దగా అనుభవం లేకపోవడంతో ఏకగ్రీవ మద్దతు లభించలేదు’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపినట్టు పేర్కొంది.

ఇక గంభీర్ కోచింగ్ శైలి మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పోలిస్తే చాలా భిన్నంగా ఉందని, జట్టు ఎలా అలవాటు పడుతోందనే అంశంపై కూడా బీసీసీఐ సమీక్షలో చర్చించారు. న్యూజిలాండ్ చేతిలో ఘోరపరాజయం నేపథ్యంలో ఆసీస్ పర్యటనలో తిరిగి గాడిలో పడాలని బీసీసీఐ సూచించింది. మరి గంభీర్, రోహిత్, అగార్కర్ ఎలా ముందుకెళతారో చూడాలని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియా 0-3తో వైట్‌వాష్ కు గురవడంతో స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై కూడా తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.


More Telugu News