శివయ్య సాక్షిగా చెబుతున్నాను... మూసీ ప్రాజెక్టును పూర్తి చేస్తా: రేవంత్ రెడ్డి

  • మూసీ పరీవాహాక ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉందన్న సీఎం
  • మూసీ వల్ల పరిస్థితి అణుబాంబు ప్రాంతం కంటే దారుణంగా ఉందని వ్యాఖ్య
  • నకిలీ బీజేపీ నేతలు అంటూ ఆగ్రహం
సంగెం శివయ్య సాక్షిగా చెబుతున్నానని... మూసీ నది ప్రాజెక్టును తప్పకుండా పూర్తి చేసి తీరుతామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సంగెం శివయ్యను దర్శించుకొని తాను సంకల్పం తీసుకున్నానన్నారు. ఈరోజు మూసీ పునరుజ్జీవ యాత్ర సందర్భంగా సీఎం సంగెం నుంచి నాగిరెడ్డిపల్లి వరకు యాత్ర నిర్వహించారు. ధర్మారెడ్డి కాలువ వెంట 2.5 కిలోమీటర్ల యాత్ర చేశారు. సంగెంలో శివుడికి పూజలు చేసి... ఆ తర్వాత పాదయాత్రను ప్రారంభించారు. యాత్ర అనంతరం ఏర్పాటు చేసిన సభలో గ్రామస్థులు చెప్పిన సమస్యలను విన్నారు.

అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... మూసీ పరీవాహాక ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఇక్కడ పాలు, కూరగాయలు... ఇలా అన్నీ కలుషితమయ్యాయన్నారు. మూసీ నీటితో పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. ఒకప్పుడు మూసీ నది జీవనదిగా ఉండేదని పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో ఓవైపు ఫ్లోరైడ్, మరోవైపు కలుషిత మూసీ ఆందోళన కలిగిస్తోందన్నారు. ఉమ్మడి నల్గొండ ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందా? లేదా? అని ప్రశ్నించారు.

మూసీ వల్ల హైదరాబాద్ పరిస్థితి అణుబాంబు పడిన ప్రాంతం కంటే దారుణంగా మారిందన్నారు. ఈ అణుబాంబు ఆటంబాంబుగా మారకముందే మనం జాగ్రత్తపడాల్సి ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు దోపిడీ చేసినవారు ఇప్పుడు తనను మూసీ ప్రాజెక్టుతో దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించడం విడ్డూరమన్నారు. తానేమీ డబ్బు కోసం చూడటం లేదన్నారు.

నకిలీ బీజేపీ నేతలు అంటూ ఆగ్రహం

ప్రధాని మోదీ రూ.40 వేల కోట్లు ఖర్చు చేసి గంగానదిని ప్రక్షాళన చేశారని గుర్తు చేశారు. గుజరాత్‌లో సబర్మతిని కూడా మోదీ బాగు చేశారన్నారు. కానీ నకిలీ బీజేపీ నేతలు మాత్రం తనను విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. మోదీ సబర్మతిని బాగు చేసినట్లుగా నేను తెలంగాణ బిడ్డగా మూసీ నదిని ప్రక్షాళన చేయవద్దా? అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన చేయకుంటే ఇక తన జీవితం ఎందుకన్నారు. ఈరోజు నా జన్మదినం కాదని... తన జన్మధన్యమైన రోజు అని అన్నారు.


More Telugu News