పెళ్లికి సెలవు ఇవ్వనన్న బాస్... అయినా ఆగని పెళ్లి... ఎలాగంటే?

  • తుర్కియేలో ఉన్న వరుడికి, హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న వధువుకు ఆన్‌లైన్‌లో నిఖా
  • బాస్ సెలవు ఇవ్వకపోవడంతో వర్చువల్ పెళ్లికి అంగీకరించిన ఇరు కుటుంబ సభ్యులు
  • ఆదివారం బారాత్.. సోమవారం పూర్తయిన పెళ్లి
పెళ్లి చేసుకొని వస్తానని ఓ యువకుడు సెలవు అడిగితే బాస్ తిరస్కరించాడు... మరోపక్క అనారోగ్యంతో ఉన్న పెళ్లికూతురు తాతయ్య త్వరగా వివాహం చేసుకోవాలంటూ పట్టుబట్టాడు. అనివార్యమైన ఈ పరిస్థితిలో ఓ యువకుడు ఆన్‌లైన్ పెళ్లి చేసుకున్నాడు. తుర్కియేలో ఉద్యోగం చేస్తున్న అద్నాన్ మహ్మద్ అనే యువకుడు, హిమాచల్ ప్రదేశ్‌లోని మండీలో ఉన్న వధువుని వర్చువల్‌గా వివాహం చేసుకున్నాడు. 

కాగా పెళ్లికొడుకు అద్నాన్ మహ్మద్‌ బిలాస్‌పూర్ నివాసి. ఉద్యోగ రీత్యా తుర్కియేలో ఉన్న అతడికి సెలవు దొరక్కపోవడంతో ఆన్‌లైన్‌లోనే ‘నిఖా’ చేసుకున్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వధువు తాత అనారోగ్యంతో ఉన్నారని, త్వరగా పెళ్లి చేసుకోవాలని ఆయన పట్టుబట్టారని పేర్కొన్నారు. ఇరు కుటుంబాల సభ్యులు వర్చువల్ పెళ్లికి అంగీకరించడంతో జరిపించామన్నారు. ఆదివారం బరాత్ జరిగిందని, మరుసటి సోమవారం పెళ్లి జరిగిందని వారు వెల్లడించారు.

వీడియో కాలింగ్ ద్వారా ఓ ఖాజీ ఈ పెళ్లి జరిపించారు. ఆచారం ప్రకారం వధువరులతో ‘ఖుబూల్ హై’ అని మూడుసార్లు చెప్పించారు. కాగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతోనే ఈ పెళ్లి సాధ్యమైందని పెళ్లికూతురు బంధువు అక్రమ్ మహ్మద్ అన్నారు.


More Telugu News