భారత దౌత్యవేత్తలకు రహస్య మెమో అంటూ ప్రచారం... స్పందించిన విదేశాంగ శాఖ

  • వేర్పాటువాదులపై బలమైన దళాన్ని తయారు చేసుకోవాలంటూ మెమో జారీ చేసినట్లు ప్రచారం
  • 2023 ఏప్రిల్ తేదీతో మాజీ కార్యదర్శి ఈ మెమో జారీ చేసినట్లుగా ప్రచారం
  • అది ఫేక్ మెమో అని స్పష్టం చేసిన విదేశాంగ శాఖ
విదేశాల్లోని భారత దౌత్యవేత్తలకు కేంద్ర ప్రభుత్వం రహస్యంగా ఓ మెమోను ఇచ్చిందని వస్తున్న వార్తలపై విదేశాంగ శాఖ స్పందించింది. కెనడాలోని ఖలిస్థాన్ వేర్పాటువాదులను అడ్డుకోవడానికి అధికారులు ఓ దళాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించినట్లుగా ఓ మెమో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇది భారత విదేశాంగ శాఖ పేరుతో ఉందంటూ, నెట్టింట వైరల్‌గా మారింది. 2023 ఏప్రిల్ తేదీతో ఉన్న ఆ మెమోను మాజీ విదేశాంగ కార్యదర్శి వినయ్ కత్రా జారీ చేసినట్లుగా ఉంది.

కెనడాలోని ఖలిస్థాన్ ఉగ్రవాదులను అడ్డుకునేందుకు భారతీయ మూలాలున్న వారితో బలమైన దళాన్ని ఏర్పాటు చేయాలని అందులో ఉంది. అయితే ఈ మెమో నకిలీది అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

ఆ మెమో నకిలీదని... అలాంటి మెమో ఏదీ కేంద్రం జారీ చేయలేదని స్పష్టం చేసింది. భారత దౌత్యవేత్తలకు హింసాత్మక నేరాలను అంటగడుతూ తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఖలిస్థానీ సానుభూతిపరుడు నిజ్జర్ హత్య అంశంలో భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ సీక్రెట్ మెమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


More Telugu News